Dhulipala Narendra Kumar: మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అరాచకానికి తెరతీశారు: ధూళిపాళ్ల నరేంద్ర

  • కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారన్న ధూళిపాళ్ల 
  • శిక్ష నుంచి తప్పించుకోవడానికే కోర్టులో ఫైల్ ను చోరీ చేయించారని ఆరోపణ 
  • దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వ్యాఖ్య 
Dhulupala Narendra Kumar fires on Kakani

ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు గుప్పించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన అరాచకానికి తెరతీశారని చెప్పారు. ఏడు కేసుల్లో కాకాణి ముద్దాయిగా ఉన్నారని అన్నారు. ఆ కేసులకు సంబంధించి అక్రమ ఆధారాలను సృష్టించారని, అక్రమ ఆధారాలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. కల్పిత ఆధారాలు సృష్టించిన కేసులో ఆధారాలన్నీ కోర్టులో ఉన్నాయని తెలిపారు. కాకాణిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వగా.. ఆ జీవోను కోర్టు నిరాకరించిందని చెప్పారు. ఈ క్రమంలోనే నెల్లురు కోర్టులో దొంగతనం జరిగిందని అన్నారు. 

కోర్టులో జరిగిన చోరీపై అనేక అనుమానాలు ఉన్నాయని... సెలవు రోజున కోర్టు ఉద్యోగి కోర్టుకు ఎందుకు వెళ్లాడని ఆయన ప్రశ్నించారు. దొంతనంపై జిల్లా ఎస్పీ కూడా కల్పిత కథను అల్లారని చెప్పారు. కోర్టులో వేల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటే... కేవలం కాకాణికి చెందిన ఫైల్ మాత్రమే ఎందుకు మాయమయిందని ప్రశ్నించారు. ఈ కేసులో కాకాణికి శిక్ష పడటం ఖాయమని చెప్పారు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే చోరీ చేశారని ఆరోపించారు. ఈ దొంగతనం న్యాయ వ్యవస్థకే మచ్చ అని తెలిపారు. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందని అన్నారు. ప్రభుత్వంలోని పెద్దల సహకారంతోనే కోర్టులో చోరీ జరిగిందని ఆరోపించారు.

More Telugu News