Lakhimpur Kheri: ల‌ఖింపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి కొడుకు బెయిల్ ర‌ద్దు

supreme court cancels Lakhimpur Kheri violence case accused ashish mishra bail
  • ల‌ఖింపూర్ కేసులో ఆశిష్ ప్ర‌ధాన నిందితుడు
  • బెయిల్ మంజూరు చేసిన అల‌హాబాద్ హైకోర్టు
  • బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సుప్రీంకు వెళ్లిన రైతుల కుటుంబాలు 
  • ఈ నెల 4న వాద‌న‌ల‌ను పూర్తి చేసి, నేడు తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
నూత‌న సాగు చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్న అన్న‌దాత‌ల‌ను కారుతో ఢీకొట్టించిన కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ ర‌ద్దు అయ్యింది. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం స‌ర్వో‌న్నత న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. వారంలోగా లొంగిపోవాల‌ని కూడా ఆశిష్‌కు సుప్రీంకోర్టు గ‌డువు విధించింది.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన నూత‌న సాగు చ‌ట్టాల‌ను రద్దు చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రి హోదాలో అజ‌య్ మిశ్రా ల‌ఖింపూర్ ఖేరీ వ‌స్తున్న సంద‌ర్భంగా రైతులు మంత్రికి త‌మ నిర‌స‌న‌ను తెలిపే య‌త్నం చేశారు. ఈ  క్ర‌మంలో త‌మ‌కు అడ్డు నిలుస్తారా? అన్న‌ కోణంలో ర‌గిలిపోయిన ఆశిష్ మిశ్రా... రైతుల‌పైకి త‌న కారును దూకించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘ‌ట‌నలో 8 మంది రైతులు మ‌రణించారు. 10 మందికి పైగా రైతులు గాయ‌ప‌డ్డారు. 

ఈ ఘ‌ట‌న‌లో అరెస్టయిన ఆశిష్ మిశ్రాకు అల‌హాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే చ‌నిపోయిన రైతుల కుటుంబాలు ఆశిష్ బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

ఈ నెల 4న‌నే ఇరు వ‌ర్గాల వాద‌న‌ల‌ను ముగించిన కోర్టు నేడు తీర్పును వెలువ‌రించింది. బాధితుల త‌ర‌ఫు వాద‌న‌ల‌ను కూడా విన్న త‌ర్వాత బెయిల్‌పై అల‌హాబాద్ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుని ఉంటే బాగుండేద‌ని ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అభిప్రాయ‌ప‌డ్దారు.
Lakhimpur Kheri
Lakhimpur Kheri violence
Ajay Mishra
Ashish Mishra
Supreme Court

More Telugu News