India: దేశంలో ఒక్క రోజులోనే 90 శాతం పెరిగిన కరోనా కేసులు.. పెరుగుతున్న ఫోర్త్ వేవ్ భయాలు!

Corona cases in India raised by 90 percent in a single day
  • గత 24 గంటల్లో 2,183 కరోనా కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 214 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,542
దేశంలో కరోనా కేసులు మళ్లీ వ్యాప్తి చెందుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి రెండు వేలను దాటేసింది. గత 24 గంటల్లో 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య 1,150 మాత్రమే. అంటే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపు 90 శాతం మేర పెరిగింది. 

ఇదే సమయంలో కరోనా మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి. అయితే వీటిలో 62 బ్యాక్ లాగ్ మరణాలు ఉన్నప్పటికీ... అంతకు ముందు రోజులో పోలిస్తే మరణాల సంఖ్య భారీగానే పెరిగింది. 

ఇక రోజు వారీ పాజిటివిటీ రేటు 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,30,44,280కి చేరుకోగా... మరణాల సంఖ్య 5,21,965కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 11,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 2,66,459 డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 1,86,54,94,355 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
India
Corona Virus
Updates

More Telugu News