Boris Johnson: తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై నిషేధం విధించిన రష్యా

Russia bans British Prime Minister Boris Johnson
  • రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాల ప్రయత్నాలు
  • రష్యన్ నేతలు, కంపెనీలపై పలు దేశాల్లో ఆంక్షలు
  • 13 మంది బ్రిటన్ నేతలపై రష్యా నిషేధం
  • జాబితాలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిస్సా మే కూడా  
ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో తనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆంక్షలు విధించిన నేపథ్యంలో, రష్యా కూడా ప్రతిచర్యకు దిగింది. అప్పటికే పలువురు అంతర్జాతీయ నేతలు రష్యాలో ప్రవేశించకుండా నిషేధించిన పుతిన్ ప్రభుత్వం... తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పైనా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. 

అంతేకాదు, రష్యాలో ప్రవేశించకుండా బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, అనేకమంది క్యాబినెట్ మంత్రులపైనా నిషేధాజ్ఞలు విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. మొత్తమ్మీద ప్రధాని బోరిస్ జాన్సన్ సహా 13 మంది బ్రిటన్ ప్రముఖులను నిషేధిత నేతల జాబితాలో చేర్చింది. వారిలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిస్సా మే కూడా ఉన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ జాబితాను మరింత విస్తరిస్తామని కూడా రష్యా హెచ్చరించింది. 

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు దిగిన నేపథ్యంలో, రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలకు తెరలేపాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన కుటుంబ సభ్యులపై అనేక దేశాలు నిషేధం విధించాయి. పుతిన్ కుటుంబ ఆస్తులతో పాటు, విదేశాల్లోని రష్యన్ కుబేరుల ఆస్తులపైనా, రష్యా కంపెనీలపైనా కఠిన ఆంక్షలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, రష్యా కూడా పలు దేశాల ప్రముఖులను నిషేధిస్తోంది.
Boris Johnson
UK
Prime Minister
Ban
Russia
Ukraine

More Telugu News