CJI: తెలంగాణ ప్రభుత్వం ఏది అడిగినా చేస్తోంది.. చేతికి ఎముకలేని వారంటూ సీఎం కేసీఆర్​ పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు

  • జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచడం జరిగిందన్న సీజేఐ  
  • న్యాయవ్యవస్థలో సమస్యలు ఆందోళన పరుస్తున్నాయని వ్యాఖ్య 
  • మౌలిక వసతులు, ఖాళీల భర్తీపై సీజేఐ ఆందోళన
  • సరిపోను కోర్టులుంటేనే త్వరగా న్యాయం అందుతుందన్న జస్టిస్ రమణ 
CJI NV Ramana Expresses Concerns On These Issues

న్యాయవ్యవస్థలో మౌలిక వసతులు లేకపోవడం, ఖాళీల భర్తీని చేయకపోవడంపట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. సరిపోను కోర్టులు, మౌలిక వసతులు, సిబ్బంది, జడ్జిలున్నప్పుడే అందరికీ త్వరగా న్యాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. 

ప్రస్తుతం న్యాయవ్యవస్థపై తీవ్రమైన భారం పడుతోందని, అందుకు వంద కారణాలు తాను చెప్పగలనని అన్నారు. కొన్ని లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలంటే ఎన్ని ఏళ్లు పట్టాలని ఆయన అన్నారు. హయ్యర్ఆర్కీ వ్యవస్థ వల్ల కేసుల పరిష్కారానికి చాలా సమయం పడుతోందన్నారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన న్యాయాధికారుల సదస్సును ప్రారంభించి ఆయన మాట్లాడారు. 

తాను సీజేఐ అయ్యాక ఆ విషయాలపైనే దృష్టి సారించానని గుర్తు చేశారు. వీలైనంత ఎక్కువ మంది జడ్జిలను నియమించాల్సిన అవసరం ఉందని, సుప్రీంకోర్టయినా.. హైకోర్టయినా.. జిల్లా కోర్టులైనా ఒక్క ఖాళీ కూడా ఉండకూడదని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ద్వారా సర్వే చేయించామని, కోర్టుల్లో సరైన మౌలిక వసతులే లేవని తేలిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని ఆయన గుర్తు చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం ఏది అడిగినా చేస్తోందని, అలాంటి ప్రభుత్వం ఉన్నందుకు అదృష్టవంతులని అన్నారు. కోర్టులను పెంచడం దగ్గర్నుంచి మౌలిక సదుపాయాలు కల్పించేదాకా అన్ని విషయాల్లోనూ తాను అడిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం చేసేస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచామన్నారు. 

తాజాగా మరో 17 మంది జడ్జిల నియామకానికీ లైన్ క్లియర్ అయిందన్నారు. అంతకుముందు 14 మందిని సిఫార్సు చేయగా.. అందులో ఇద్దరి ఫైలు పెండింగ్ లో ఉందన్నారు. 

జిల్లా కోర్టుల్లో సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత న్యాయాధికారులపై ఉందని, కోర్టులకు వచ్చే కక్షిదారులు ఎంతో ఒత్తిడితో ఉంటారని, అలాంటి వారికి మంచి వాతావరణం ఉండేలా చూడాలని ఆయన కోరారు. ప్రతి వివాదాన్నీ మానవతా కోణంలోనే చూడాలని సూచించారు. న్యాయం అందరికీ సమానమేనన్నారు. 

కోర్టుకు ఎవరొచ్చినా గౌరవంగా చూడాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. దివ్యాంగులైనా, బలహీనవర్గాలవారైనా సమానంగా చూడాలన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏదో ఫార్మాలిటీ కాదని అన్నారు. అధికార పరిధిని తెలియజెప్పేదన్నారు. నిందితుడికీ పలు హక్కులు ఉంటాయని చెప్పే గ్రంథమన్నారు. 

భయం లేకుండా న్యాయ సేవలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలి కాలంలో జడ్జిల మీద భౌతిక దాడుల ఉదంతాలు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు లోపల, బయటా జడ్జిల భద్రత పెంపునకు సంబంధించి ఉత్తర్వులూ ఇచ్చామన్నారు. జడ్జిలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నారు. భార్యాపిల్లలతో సమయాన్ని గడపాలని సూచించారు. 

చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని, ఆ కష్టాలు లేనప్పుడే జడ్జిలు తీర్పులు సరిగ్గా ఇవ్వగలుగుతారని సీజేఐ అన్నారు. ఈ విషయంపై పే కమిషన్ తో చర్చిస్తున్నానని చెప్పారు. త్వరలోనే శుభవార్త చెబుతానని పేర్కొన్నారు. 

కాగా, న్యాయవ్యవస్థకు జిల్లా కోర్టులే ఆధారమని, అవి పటిష్ఠంగా ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందని అన్నారు. 

చేతికి ఎముక లేని తనానికి సీఎం కేసీఆర్ ట్రేడ్ మార్క్ అని సీజేఐ అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుంటుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణలో 4,320 మందికి ఉద్యోగాలిచ్చారన్నారు. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోనూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయన్నారు.

More Telugu News