Russia: మరియుపోల్‌లో రష్యా రసాయన దాడి.. డ్రోన్‌తో ఫాస్పరస్ బాంబు వేసిన వైనం

Russia accused of using phosphorus bombs in Ukraine
  • ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దురాక్రమణ
  • స్టీల్‌ప్లాంట్‌కు రక్షణగా ఉన్న వారిపై ఫాస్ఫరస్ బాంబు జారవిడిచిన రష్యా
  • తీవ్రంగా ఖండించిన బ్రిటన్, ఆస్ట్రేలియా
  • తమ భూమిని కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్న జెలెన్‌ స్కీ
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్న రష్యా తాజాగా మరో అడుగు ముందుకేసింది. మరియుపోల్‌లో స్టీల్ ప్లాంట్‌కు రక్షణగా ఉన్న ఉక్రెయిన్ ఫైటర్లపై రష్యా నిన్న డ్రోన్ల ద్వారా రసాయన (ఫాస్ఫరస్) బాంబును జారవిడిచింది. 

అయితే, ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని ఉక్రెయిన్ రక్షణశాఖ సహాయమంత్రి హన్నా మల్యార్ తెలిపారు. రష్యా రసాయన బాంబులు వేయడంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇది యుద్ధాన్ని తీవ్రతరం చేసే చర్యేనని బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాలను రష్యా మూకుమ్మడిగా ఉల్లంఘించిందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మరైస్ పైన్ అన్నారు. 

మరోవైపు, రష్యా దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న మరియుపోల్‌లో పరిస్థితులు భీతావహంగా ఉన్నాయి. నగరంలో 80 వేల ఇళ్లు ధ్వంసం కాగా 1.20 లక్షల మంది ఆహారం, నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 10 వేల మందికిపైగా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ సంఖ్య 20 వేల వరకు కూడా వుండచ్చని మేయర్ వాదిమ్ బయ్‌చెంకో చెబుతున్నారు.

ఇదిలావుంచితే, లక్ష్యం నెరవేరే వరకు సైనిక చర్యను ఆపే ప్రసక్తే లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. నష్టం తక్కువగా ఉండాలన్న ఉద్దేశంతోనే యుద్ధం నెమ్మదిగా సాగుతున్నట్టు చెప్పారు. ఆంక్షల దాడిని తట్టుకుని నిలబడ్డామని, తమను ఎవరూ వెలివేయలేరని తేల్చి చెప్పారు. మరోవైపు, తమ భూభాగాన్ని కోల్పోయేందుకు తాము సిద్ధంగా లేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
Russia
Ukraine
War
Vladimir Putin
Volodymyr Zelenskyy

More Telugu News