lifestyle: గుండెకు ఇవి ప్రాణాంతకాలు.. దూరం పెట్టేస్తే పోదూ..!

  • గుండెకు ముప్పుతో ఇతర అవయవాలకూ రిస్క్
  • పొగతాగడం, ఆల్కహాల్ మంచివి కావు
  • స్నాక్స్ కు దూరంగా ఉండాలి
  • ఒత్తిడిని జయించాలి.. శారీరకంగా శ్రమించాలి
lifestyle choices we need to let go for a healthy heart

ఆహారం, జీవనశైలి.. ఈ రెండే మన ఆరోగ్యాన్ని నిర్ణయించేవి. వీటి పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. నిర్లక్ష్యం చేస్తే వైద్యుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. భారీగా బిల్లులు చెల్లించుకోవాల్సి రావచ్చు. ఆ పరిస్థితులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడమే సులభం. 

మన శరీరంలోని కీలక అవయవాల్లో గుండె ఒకటి. దీని పట్ల మరింత శ్రద్ధ చూపాలి. లేదంటే గుండెకు సమస్యలు ఏర్పడితే దానికి అనుసంధానమై ఉన్న ఇతర అవయవాల పనితీరు కూడా ప్రభావితమవుతుంది. గుండె ఆరోగ్యం కోసం దూరం పెట్టాల్సిన వాటిని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తిలక్ సువర్ణ తెలియజేశారు. 

స్నాక్స్
శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ గుండెకు హాని చేస్తాయి. రోజువారీ ఆహారంలో స్నాక్స్, ఇతర కొన్ని రకాల పదార్థాల ద్వారా ఇవి శరీంలోకి పెద్ద మొత్తంలోనే చేరుతున్నాయి. ఒక చిన్న ప్యాకెట్ ఆలుగడ్డ చిప్స్ తీసుకుంటే ఆ రోజు మన శరీరానికి కావాల్సిన ఫ్యాట్స్ లో సగం అందినట్టే. నూనెలో వేయించిన ఆలూ ఫ్రైస్ లోనూ పెద్ద మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. దాదాపు అధిక శాతం వంట నూనెల్లో 13-19 శాతం మేర శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.

అందుకని బాగా వేయించిన పదార్థాలు, నూనెలో కాల్చిన వాటిని ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ, రోజువారీగా తీసుకోవద్దు. పండ్లు, వేయించిన శనగపప్పు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, తాజా కూరగాయలు, చేపలు మంచివి. తీపి పానీయాలను దూరం పెట్టాలి. స్కిన్ లెస్ చికెన్ కు పరిమితం కావాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా మంచివి కావు. 

ఉప్పు వినియోగం
ఆహారం ద్వారా తీసుకునే ఉప్పు మోతాదు మించి శరీరంలో చేరితే అది రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. శరీరంలో ఉప్పు పెరిగిన కొద్దీ అధిక శాతం నీరు శరీరంలో ఉండిపోతుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. పెద్దలు రోజుకు 6 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. అంటే ఒక టీ స్పూన్. అన్ని రకాల ఆహారంలో ఉండే వాటితో కలిపి ఈ పరిమితి అమలు చేయాలి. పిల్లలకు ఇంకా తక్కువ పరిమాణం ఉండేలా చూడాలి. రెడీ టు ఈట్ స్నాక్స్, ఇతర ఉత్పత్తులను దూరం పెట్టాలి.

శారీరక వ్యాయామం లేకపోవడం
శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం కూడా గుండెకు చేటు చేస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. కనీసం రోజులో 30-40 నిమిషాలు వ్యాయామం, బ్రిస్క్ వాక్ లేదా రన్నింగ్ చేయాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని మరింత దృఢం చేస్తుంది. వారంలో కనీసం 150 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచన. 

ఆల్కహాల్
ఆల్కహాల్ తరచుగా, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది గుండె ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది. చాలా స్వల్ప మోతాదులో తీసుకుంటే గుండెకు మంచిదన్న ఒక అభిప్రాయం ఉంది. కానీ, ఎంత తీసుకున్నా ఆల్కహాల్ అన్నది గుండెకు పెద్ద శత్రువు. ఇది ఎంత హాని చేసిందన్నది దీర్ఘకాలంలో తెలుస్తుంది. 

స్మోకింగ్
పొగతాగడం గుండె జబ్బులకు కారణమవుతుంది. కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ రిస్క్ పెరుగుతాయి. పొగతాగే అలవాటుతో గుండె ఆర్టరీ గోడలు దెబ్బతింటాయి. దీంతో ఫ్యాట్ పేరుకుని, ప్రవాహ మార్గాలు కుచించుకుపోతాయి. పొగతాగడం వల్ల రక్తంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి. దీంతో అధిక ఆక్సిజన్ కోసం గుండె మరింతగా పనిచేయాల్సి వస్తుంది. 

ఒత్తిడి
ఒత్తిడి పరోక్షంగా గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. ఒత్తిడితో రక్తపోటు పెరుగుతుంది. అదే గుండెపై ప్రభావానికి దారితీస్తుంది. అందుకని ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రాణాయామం, ధ్యానం, యోగా వంటి వాటిని అనుసరించాలి.

More Telugu News