Mamata Banerjee: అత్యాచారంపై మమతా బెనర్జీ వ్యాఖ్యల పట్ల దుమారం

Mamata Banerjees rape comment draws widespread ire
  • హాష్ కాలి రేప్ కేసుపై పెద్ద ఎత్తున దుమారం  
  • ఇది కచ్చితంగా ప్రేమ వ్యవహారమేనన్న మమత 
  • ఇది యూపీ కాదు, ప్రేమ జిహాద్ ఇక్కడ చేయనివ్వమన్న సీఎం 
  • ఒక అనుమానితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారని వెల్లడి    
  • దీన్ని తప్పుబడుతున్న నెటిజన్లు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఓ అత్యాచారం విషయమై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ప్రముఖ సినీ నిర్మాత శ్రీజిత్ ముఖర్జీ సైతం మమత వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘హాష్ కాలి రేప్ కేసులో సీఎం నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఊహించలేనంత అభ్యంతరకరమైన, సున్నితమైనవి. మాటలు రాక నోరు మూగబోయింది’’ అంటూ శ్రీజిత్ ముఖర్జీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. 

‘‘మైనర్ అత్యాచారం వల్ల చనిపోయిందని అంటున్నారు. మీరు దాన్ని అత్యాచారం అని ఎలా అంటారు? ఆమె గర్భవతా? లేక ప్రేమ వ్యవహారం నడుపుతోందా? విచారించారా? అంటూ పోలీసులను అడిగాను. వారు ఆ బాలికకు బాలుడితో అఫైర్ ఉందని వారు నాకు చెప్పారు. 

ఇది కచ్చితంగా ప్రేమ వ్యవహారమే. ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇది తెలుసు. ఏ జంట అయినా బంధంలో ఉంటే నేను ఆపగలనా? ఇది యూపీ కాదు. మేము ప్రేమ జిహాద్ ఇక్కడ చేయం. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. ఏదైనా తప్పు జరిగితే నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఒక అనుమానితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు’’ అంటూ మమత స్పందించారు. 

ఇప్పుడు ఇవే వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతున్నారు. మహిళ అయి ఉండి, అత్యాచారాలను దాచి పెడతున్నారని కొందరు విమర్శిస్తే.. పదేళ్ల క్రితం 2012లోనూ పార్క్ స్ట్రీట్ అత్యాచారం కేసులో ఆమె ఇలానే మాట్లాడారని, బాధితురాలిని సెక్స్ వర్కర్ అంటూ తృణమూల్ ఎంపీలు విమర్శించిన విషయాన్ని ఓ ట్విట్టర్ యూజర్ ప్రస్తావించారు. అదే కేసులో ఆరోపణలు నిజమై నిందితులు తర్వాత జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నుంచి అటువంటి స్పందన రావడం భయంకరమని ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు.
Mamata Banerjee
comments
girl rape

More Telugu News