Supreme Court: అమ్మ విపరీతంగా కొట్టేది.. బాత్రూంలో పడేసి తాళం వేసేది.. ఆమెతో మాట్లాడను: సుప్రీంకోర్టుకు యువకుడి ఫిర్యాదు

I dont want to talk to my mother as she beat me every time a youth complains to supreme court
  • ఆమెతో మాట్లాడితే ఆ గడ్డు రోజులే గుర్తొస్తాయి
  • ఏ తల్లి ఏడేళ్ల తన కొడుకును చిత్రహింసలు పెడుతుందంటూ ఆవేదన
  • బుజ్జగించేందుకు ప్రయత్నించిన న్యాయస్థానం
  • ససేమిరా అన్న 27 ఏళ్ల యువకుడు
అమ్మంటే.. నవమాసాలు కడుపులో చల్లంగ కాపాడి.. భూమ్మీద పడిన బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని ప్రేమ పంచే దేవత. అలాంటి దేవత గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ఎంత మంది కవులు, ఎన్నో రకాలుగా వర్ణించినా అది తక్కువే. 

కానీ, ఓ అమ్మ మాత్రం తన కొడుకు పట్ల రాక్షసిగా మారిపోయింది. చిత్రహింసలు పెట్టింది. అవును, స్వయంగా ఆ కొడుకే సుప్రీంకోర్టు గడపతొక్కి తనకు జరిగిన ఘటనలను పూసగుచ్చినట్టు వివరించాడు. అమ్మ తనను విపరీతంగా కొట్టేదని, బాత్రూంలో బంధించేదని చెప్పాడు. తనకు అమ్మతో మాట్లాడడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. తన తల్లిదండ్రులు విడివిడిగానే ఉంటున్నారని, రెండు దశాబ్దాలుగా విడాకుల కోసం కొట్లాడుకుంటున్నారని, తన బాల్యంలో అనేక మానసిక సంఘర్షణలకు లోనయ్యానని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

నిన్న సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్ ల ధర్మాసనం ముందుకు వచ్చిన విడాకుల కేసు విచారణ సందర్భంగా ఆ యువకుడు తన బాధనంతా వెళ్లగక్కాడు. అయితే, అమ్మతో మాట్లాడాలంటూ జడ్జిలు ఆ యువకుడిని దాదాపు 45 నిమిషాల పాటు బుజ్జగించే ప్రయత్నం చేసినా.. అతడు ససేమిరా అన్నాడు. 

తండ్రితో ఉంటున్న అబ్బాయితో మాట్లాడేందుకు అవకాశం ఇప్పించాల్సిందిగా యువకుడి తల్లి తరఫు లాయర్.. కోర్టును కోరారు. అందుకు స్పందించిన జస్టిస్ చంద్రచూడ్.. మాట్లాడాలంటూ సూచించారు. అయితే, 27 ఏళ్ల ఆ యువకుడు తనకు చిన్నప్పుడు జరిగిన సంఘటనలను కోర్టు కళ్లకు కట్టినట్టు వివరించాడు. 

ఏడేళ్ల వయసున్నప్పుడు తనను తీవ్రంగా కొట్టేదని, బాత్రూంలో పడేసి తాళం వేసేదని గుర్తు చేసుకున్నాడు. అమ్మతో మాట్లాడినప్పుడల్లా ఆ గడ్డు పరిస్థితులు గుర్తుకొచ్చేవన్నాడు. ఇకపై ఆమెతో మాట్లాడడం తనకు అస్సలు ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. ఏడేళ్ల కొడుకుపై ఏ తల్లి అంత టార్చర్ పెడుతుందని ప్రశ్నించాడు. తన తండ్రి ఇప్పటివరకు తనపై చెయ్యెత్తి ఎరుగడన్నాడు. 

తల్లి తరఫు న్యాయవాది మాత్రం అవన్నీ కట్టుకథలని, అలాంటివేవీ జరగలేదని వాదించారు. అయితే, యువకుడేం చిన్నపిల్లాడుకాదని, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే విజ్ఞత వచ్చిన వయస్కుడేనని కోర్టు చెప్పింది. యువకుడి తండ్రి తరఫు వాదించిన అడ్వొకేట్ అర్చనా పాఠక్ దవే.. అసలు కన్న కొడుకు కస్టడీ కోసం ఏనాడూ ఆ తల్లి కోర్టుకొచ్చిన సందర్భాలు లేవని చెప్పారు. యువకుడి తండ్రి ఎలాంటి గొడవల్లేకుండా ప్రశాంతంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని, వీలైనంత త్వరగా విడాకులను మంజూరు చేయాలని కోర్టును కోరారు. 

ఆ వాదనలను తల్లి తరఫు లాయర్ కొట్టిపారేశారు. విడిపోయి ఒంటరిగా బతకడం తన క్లయింట్ కు ఇష్టం లేదని, విడాకులు ఇవ్వవద్దని కోరారు. కాగా, 1988లో ఆ ఇద్దరు దంపతులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2002 నుంచి విడాకుల కోసం దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Supreme Court
Crime News
Divorce
Son
Father
Mother

More Telugu News