Thippeswami: చివరి నిమిషంలో ముఖంచాటేసిన మంత్రిపదవి... తిప్పేస్వామి స్పందన ఇదిగో!

  • ఏపీలో కొత్త మంత్రివర్గం
  • తిప్పేస్వామిని ఊరించి ఉసూరుమనిపించిన వైనం
  • ఆయన బావమరిది ఆదిమూలపు సురేశ్ కు మంత్రిపదవి
  • తనకెలాంటి అసంతృప్తి లేదన్న తిప్పేస్వామి
  • మీడియా అసత్యప్రచారం చేస్తోందని ఆరోపణ
Thippeswami opines on minister post

ఏపీలో కొత్త మంత్రివర్గం నిన్న ప్రమాణం స్వీకారం చేసింది. అన్నీ కలిసొస్తే మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి కూడా నిన్న ప్రమాణస్వీకారం చేసినవాళ్లలో ఉండేవారు. కానీ, చివరినిమిషంలో అంతా తారుమారైంది. మంత్రివర్గ జాబితాలో ఓ దశలో తిప్పేస్వామి పేరు కూడా ఉంది. 

కానీ, పలు ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన బావమరిది ఆదిమూలపు సురేశ్ తన మంత్రిపదవిని నిలుపుకున్నారు. దాంతో తిప్పేస్వామికి మంత్రి పదవి దూరమైంది. కాగా, మంత్రి పదవులు దక్కని కొందరు తీవ్ర మనస్తాపానికి గురికాగా, వారి మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. 

ఈ నేపథ్యంలో, తిప్పేస్వామి స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో తాను అసంతృప్తితో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కుటుంబం వెంటే ఉంటానని ఉద్ఘాటించారు. 

1999లో తనకు చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోటీ చేసే అవకాశాన్ని వైఎస్సార్ కల్పించారని తెలిపారు. ఆ తర్వాత జగన్ 2014, 2019లో మడకశిర ఎమ్మెల్యేగా చాన్స్ ఇచ్చారని వివరించారు. ఆ విశ్వాసం తనకు ఉందని తిప్పేస్వామి స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగన్ తోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ ను సీఎంగా చూడాలన్న ఆశయంతో పనిచేస్తానని తిప్పేస్వామి పేర్కొన్నారు.

More Telugu News