COVID19: షాంఘైలో లాక్ డౌన్ ఆంక్షలను తట్టుకోలేకపోతున్న ప్రజలు.. నిస్పృహతో ఇళ్లలోంచి అరుపులు.. ఇవిగో వీడియోలు!

  • కరోనాతో విలవిల్లాడుతున్న డ్రాగన్ దేశం
  • షాంఘై సహా 23 దేశాల్లో కఠిన లాక్ డౌన్
  • తిండి, ఇతర అవసరాలకు కొరత
  • చికిత్స చేస్తూ నీరసించిపోతున్న డాక్టర్లు
  • కుప్పకూలిన డాక్టర్ ను పేషెంట్లే ఎత్తుకెళ్లిన వైనం 
Chinese People Wants Death Screaming From Their Apartments

చైనాలో కరోనా కన్నా.. దాని వల్ల పెట్టిన లాక్ డౌన్ తోనే జనాలకు మెంటల్ ఎక్కిపోతోంది. ఆ దేశం ‘జీరో కొవిడ్’ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండడంతో ప్రజలు తాళలేకపోతున్నారు. ఏప్రిల్ 5 నుంచి దేశంలోని ఆర్థిక రాజధాని షాంఘై సహా 23 సిటీల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, షాంఘై ప్రజల గోస మాత్రం వర్ణనాతీతంగా ఉంది. 

వారం రోజులుగా ఇంట్లోనే ఉంటుడడం, ఆహారం ఇతర అవసరాలకు కొరత ఏర్పడడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సిటీలోని ప్రజలు తమ అపార్ట్ మెంట్ల నుంచే అరుపులు, కేకల ద్వారా అధికారుల తీరును ఎండగడుతున్నారు. 

ఇంతటి లాక్ డౌన్ ను అమలు చేసే బదులు తమను చంపేయాలంటూ వేడుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆ వీడియోలను అమెరికాకు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అపార్ట్ మెంట్లలోని ప్రజలు ‘యావో మింగ్ లే’, ‘యావో షీ’ అంటూ స్థానిక షాంఘైనీస్ భాషలో మాట్లాడారని, వాటి అర్థాలు బతుకు, చావు అని చెప్పారు. అయితే, బతుకు కన్నా చావు కోసమే ఎక్కువ అరుపులు వినిపించాయని, అంత దీనంగా అక్కడ పరిస్థితులున్నాయని తెలిపారు. 

దేశంలో కరోనా బీఏ 2 వేరియంట్ విజృంభిస్తోందని, డాక్టర్లు అలసి సొలసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాంఘైలో ఓ డాక్టర్ విశ్రాంతి లేక కుప్పకూలిపోవడంతో ఐసోలేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న రోగులే ఆ డాక్టర్ ను మోసుకెళ్లారు. దానికి సంబంధించిన వీడియోనూ ఎరిక్ ఫీల్డింగ్ ట్వీట్ చేశారు. కాగా, ఒక్క ఆదివారమే 25 వేల మందికిపైగా చైనాలో కరోనా బారిన పడ్డారు. లాక్ డౌన్ కారణంగా ఆహారం, ఇతర అవసరాలకు కొరత ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోజులో ఒక్కపూటే తింటున్నారని, కూరగాయలకు కూడా రేషన్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 26 లక్షల మంది ప్రజలకు తిండి దొరక్క అల్లాడిపోతున్నారని కథనాలు చెబుతున్నాయి. తిండి విషయంలో పేద, ధనిక వ్యత్యాసాలు చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనికులకు 30 ఆర్ఎంబీలకే ఆహారాన్ని సరఫరా చేస్తుండగా.. పేదలకు మాత్రం 200 నుంచి 300 ఆర్ఎంబీలకు ఇస్తున్నారని అంటున్నారు. ఆహారం, కూరగాయల ధరలు పది రెట్లు పెరిగాయి. 20 నుంచి 30 ఆర్ఎంబీలకు లభించే కూరగాయలను 300 ఆర్ఎంబీలకు అమ్ముతున్నారు. అందులో 200 ఆర్ఎంబీలు డెలివరీ చార్జీలే కావడం గమనార్హం. 

ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్నారని, ఆహారాన్ని దోచుకుంటున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియోలనూ ఎరిక్ ఫీల్డింగ్ పోస్ట్ చేశారు. అంతేకాదు.. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి అధికారులు తాళం వేసి సీజ్ చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

More Telugu News