Andhra Pradesh: సగం విద్యుత్‌నే వాడండి.. వారానికోసారి విద్యుత్ హాలిడే ఇవ్వండి: పరిశ్రమలకు ఏపీ ఇంధనశాఖ విజ్ఞప్తి

use half of the power used in March said ap govt
  • డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేదన్న ఇంధన శాఖ ఇన్‌చార్జ్ 
  • ఇంకా 55 మిలియన్ యూనిట్ల లోటు ఉందని వెల్లడి 
  • ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి  
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేదని ఇంధనశాఖ ఇన్‌చార్జ్ కార్యదర్శి బి.శ్రీధర్ అన్నారు. జూన్‌లో వర్షాలు కురిస్తే డిమాండ్ సాధారణస్థితికి చేరుకుంటుందని, వినియోగదారులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని ఆయన కోరారు. 

ఈ నెలాఖరు వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, విద్యుత్ ఎక్చేంజ్‌లలో విద్యుత్ దొరకని సమయంలో గ్రామాల్లో గంట, పట్టణాల్లో అరగంట కోతలు విధిస్తున్నట్టు చెప్పారు. వచ్చే నెల నుంచి పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. 

సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను కొనుగోలు చేసి అందించేందుకే ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లుగా ఉంటే 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. దీంతో 55 ఎంయూల కొరత ఏర్పడుతోందని, దీనిని ఎక్చేంజ్‌లలో కొంటున్నట్టు చెప్పారు.

 మార్కెట్‌లో విద్యుత్ దొరకనప్పుడు కోతలు విధిస్తున్నట్టు చెప్పారు. అలాగే, పరిశ్రమలు మార్చిలో వినియోగించిన విద్యుత్‌లో సగమే వాడాలని, రాత్రీపగలు పనిచేసే కంపెనీల్లో నైట్ షిఫ్ట్‌లు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. వారంలో మరో రోజు విద్యుత్ హాలిడే ఇవ్వాలని పరిశ్రమలకు చెప్పినట్టు తెలిపారు. పంటలు దెబ్బతినకుండా వ్యవసాయానికి మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.
Andhra Pradesh
Genco
Power Cuts
Power Supply

More Telugu News