Will Smith: క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌పై పదేళ్ల నిషేధం

Will Smith banned by Academy from attending Oscars for 10 years
  • వేదికపైనే క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించిన స్మిత్
  • పదేళ్లపాటు అకాడమీ సహా ఇతర ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధం
  • నిర్ణయాన్ని గౌరవిస్తానన్న విల్ స్మిత్
ఇటీవలి ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విల్‌స్మిత్‌పై మోషన్ పిక్చర్ అకాడమీ పదేళ్ల నిషేధం విధించింది. ఆస్కార్ అవార్డుతోపాటు అకాడమీ అవార్డుల వేడుకల్లోనూ స్మిత్ పాల్గొనకుండా ఈ నిషేధం విధించారు. విల్ స్మిత్‌పై చర్యలు చేపట్టేందుకు బోర్డు అకాడమీ గవర్నర్లు నిన్న సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా స్మిత్ వ్యవహారశైలిని అకాడమీ తీవ్రంగా తప్పుబట్టింది. అనంతరం పదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ పదేళ్ల కాలంలో స్మిత్ అకాడమీతోపాటు ఇతర ఈవెంట్లలోనూ వ్యక్తిగతంగా కానీ, వర్చువల్‌గా కానీ పాల్గొనకూడదు. ఈ మేరకు అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్, సీఈవో డాన్ హడ్సన్ తెలిపారు. 

ఇటీవల జరిగిన 94వ ఆస్కార్ వేడుకల సందర్భంగా వ్యాఖ్యాత క్రిస్ రాక్ వేదిక పైనుంచి స్మిత్ భార్యపై కామెంట్ చేశారు. దీంతో వేదికపైకి వెళ్లిన స్మిత్.. రాక్‌ను చెంపదెబ్బ కొట్టారు. అనుకోని ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన తర్వాత క్రిస్‌కు, అకాడమీకి స్మిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, అకాడమీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అకాడమీ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు స్మిత్ తెలిపారు.
Will Smith
Oscar Awards
Hollywood
Chris Rock

More Telugu News