: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలకు అధికారుల చెక్!
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రైవేటు వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుండడంతో అధికారులు పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టారు. ప్రైవేటు వాహన యజమానులతో తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అశోక్ కుమార్ చర్చలు జరిపారు. పరిమిత వేగంతోనే వాహనాలు ప్రయాణించేలా ఆయన కొత్త విధానాన్ని ఈ రోజు నుంచీ ఆచరణలోకి తెచ్చారు. దీని ప్రకారం వాహనాలకు తిరుమల గరుడాద్రి నగర్, తిరుపతిలోని అలిపిరి దగ్గర ప్రయాణ సమయంతో కూడిన రశీదు జారీ చేస్తారు. దీని ప్రకారం తిరుపతి నుంచి తిరుమలకు 35 నిమిషాలలో చేరుకోవాలి. అలాగే తిరుమల నుంచి తిరుపతికి 40 నిమిషాలలో చేరుకోవాల్సి ఉంటుంది. ఇంతకంటే ముందే చేరుకుంటే వారిపై చర్యలు తీసుకుంటారు. దీనివల్ల వాహనాలు పరిమిత వేగంలోనే ప్రయాణిస్తాయని తద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అధికారుల యోచన.