India: తీవ్ర పేదరికాన్ని పారదోలిన భారత్: ఐఎంఎఫ్ కితాబు

  • 2019 నాటికి 0.80 శాతానికి పరిమితం
  • కరోనా సమయంలోనూ పెరగలేదు
  • ప్రభుత్వ ఆహార సబ్సిడీల ఫలితమే ఇది
  • ఐఎంఫ్ చర్చా పత్రంలో పేర్కొన్న ఆర్థికవేత్తలు
India has almost wiped out extreme poverty International Monetary Fund

భారత్ తీవ్ర పేదరికాన్ని (దారిద్య్రం) దాదాపుగా నిర్మూలించిందంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. వినియోగంలో అసమానతలను 40 ఏళ్ల కనిష్ఠానికి తీసుకొచ్చిందంటూ తాజాగా విడుదల చేసిన ఒక చర్చా పత్రంలో పేర్కొంది. ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, అరవింద్ విర్మాణి, కరణ్ బాసిన్ ఈ చర్చా పత్రాన్ని రూపొందించారు. 


భారత్ లో ఇప్పుడు కఠిన దారిద్య్రంలో జీవిస్తున్న వారి సంఖ్య 0.80 శాతమేనని ఐఎంఎఫ్ పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలోనూ ఇది పెరిగిపోకుండా స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. రోజుకు 1.9 డాలర్లు (రోజుకు రూ.150), అంతకంటే తక్కువ కొనుగోలు శక్తి ఉన్నవారిని నిరుపేదలుగా ప్రపంచబ్యాంకు నిర్వచిస్తోంది. 2019 నాటికి ఇలాంటి వారి సంఖ్య మొత్తం జనాభాలో 0.80 శాతంగా ఉన్నట్టు ఐఎంఎఫ్ చర్చాపత్రం వెల్లడించింది.

భారత్ లో పేదలు, ధనికుల మధ్య అంతరం పెరిగిపోయిందంటూ పలు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్న తరుణంలో ఐఎంఎఫ్ చర్చా పత్రం విడుదల కావడం గమనార్హం. కరోనా వెలుగుచూసిన 2020లో ప్రభుత్వం ఇచ్చిన ఆహార సబ్సిడీలు తీవ్ర పేదరికం పెరగకుండా, కనిష్ఠ స్థాయిలోనే ఉంచేందుకు సాయపడినట్టు ఐఎంఎఫ్ తెలిపింది. ప్రభుత్వం ఆహార సబ్సిడీలను పెంచడం ద్వారా కల్పించిన సామాజిక భద్రత కరోనా విపత్తు కల్పించిన షాక్ లను తట్టుకునేలా చేసినట్టు ఐఎంఎఫ్ చర్చాపత్రంలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

More Telugu News