Revanth Reddy: పోలీస్ స్టేషన్లలో కూడా మన ఉద్యమం కొనసాగాలి: రేవంత్ రెడ్డి

Our protest should continue in police stations also
  • పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గేంత వరకు కాంగ్రెస్ పోరాడుతుంది
  • రైతు పండించిన ప్రతి గింజ కొనేంత వరకు పోరాటం కొనసాగుతుంది
  • విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడి పెద్ద ఎత్తున జరగాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు, రైతులు పండించిన చివరి గింజను కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆయన మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించాలని చెప్పారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రైతులకు నష్టాన్ని కలిగించే పరిస్థితులను తీసుకొస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. అసలైన సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా మనం పోరాడాలని చెప్పారు. రేపు విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడి కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు పాల్గొనాలని చెప్పారు. 

పోలీసులు అదుపులోకి తీసుకుంటే పోలీస్ స్టేషన్లలో కూడా ఉద్యమం కొనసాగాలని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సీనియర్ నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెలాఖరున రాహుల్ గాంధీతో వరంగల్ లో జరిగే సమావేశానికి డీసీసీ అధ్యక్షులు రావాలని.. అందరితో రాహుల్ మాట్లాడుతారని చెప్పారు.
Revanth Reddy
Congress

More Telugu News