: పురాతన మొక్క మళ్లీ చిగురించింది!
ఆ మొక్కల వయసు సుమారు 400 సంవత్సరాలు. అయినా, వాటికిప్పుడు తాజాగా ఇగుళ్ళు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ మొక్కలు అత్యంత పురాతనమైన మొక్కలుగా నిలిచాయి. 16వ శతాబ్ద కాలానికి చెందిన బ్రయోఫైట్స్ జాతికి చెందిన మొక్కలు 400 ఏళ్ల క్రితం ఘనీభవించాయి. వాటిని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెర్టాకు చెందిన శాస్త్రవేత్తలు కెనడియన్ ఆర్కిటిక్ ప్రాంతంలోని టియర్‌డ్రాప్ హిమనీనద ప్రాంతాల్లో జరిపిన పరిశోధనల్లో గుర్తించారు. సాధారణంగా బ్రయోఫైట్స్ ఇతర మొక్కల్లాగా ఉండవు. వీటికి ద్రవాలను ఇతర భాగాలకు పంపే కవాట కణజాలాలు ఉండవు. అయినా కూడా ఈ మొక్కలు సుదీర్ఘ కాలం పాటు బతికి ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ మొక్కలు ప్రయోగశాలల్లో చిగురించాయి.