BJP: పోలీస్ స్టేష‌న్‌లో బీజేపీ ఎమ్మెల్యే నిర‌స‌న‌

bjp mla raghunandan rao deeksha in police station

  • మిరుదొడ్డి ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యేను నిల‌దీసిన మ‌హిళ‌లు
  • మ‌హిళ‌లు, బీజేపీ శ్రేణుల మ‌ధ్య తోపులాట‌
  • త‌న‌కు త‌గినంత బందోబ‌స్తు ఇవ్వ‌లేద‌న్న ర‌ఘునంద‌న్ రావు
  • నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి నిర‌స‌న దీక్ష‌కు దిగిన వైనం

బీజేపీ నేత‌, దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు గురువారం పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ పోలీస్ స్టేష‌న్‌లోనే నిర‌స‌న దీక్ష‌కు దిగారు. ర‌ఘునంద‌న్ రావు నిర‌స‌న‌తో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గురువారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో పోలీస్ స్టేష‌న్‌లోనే దీక్ష‌కు దిగిన ర‌ఘునంద‌న్ రావు.. 4 గంట‌లు గ‌డుస్తున్నా.. సిద్దిపేట పోలీస్ క‌మిష‌న‌ర్ వ‌చ్చేదాకా దీక్ష విర‌మించేది లేద‌ని బీష్మించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఉప ఎన్నిక‌లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన ర‌ఘునంద‌న్ రావు గురువారం మిరుదొడ్డి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను అడ్డుకున్న మ‌హిళ‌లు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని నిల‌దీశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో తీవ్రంగా క‌ల‌త చెందిన ర‌ఘునంద‌న్ రావు త‌న‌కు స‌రిప‌డ బందోబ‌స్తు క‌ల్పించ‌ని కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆ వెంట‌నే ఆయ‌న మిరుదొడ్డి పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌కు మిరుదొడ్డి ఎస్సై, సీఐలే కార‌ణ‌మ‌ని, ఆ ఇద్ద‌రు పోలీసు అధికారులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న‌కు బందోబ‌స్తు క‌ల్పించ‌లేద‌ని ఆరోపిస్తూ..వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేష‌న్‌లోనే నిర‌స‌న‌కు దిగారు. దీక్ష విర‌మించాల‌ని పోలీసులు ఎంత‌గా న‌చ్చ‌జెప్పినా విన‌ని ర‌ఘునంద‌న్ రావు.. సిద్దిపేట పోలీస్ క‌మిష‌నర్ వ‌చ్చేదాకా తాను దీక్ష విర‌మించ‌న‌ని బీష్మించారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ప‌రిస్థితిని అంచ‌నా వేసిన పోలీసులు పోలీస్ స్టేష‌న్ గేట్లు మూసేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News