CSK: డూప్లెసిస్ ను మర్చిపోలేకపోతున్న సీఎస్కే అభిమానులు
- ఫాప్ ఎక్కడికి వెళ్లినా అభిమానిస్తామన్న ధోరణి
- కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ కు సీఎస్కే ఫ్యాన్స్
- ఫాప్ కోసం వచ్చామంటూ బ్యానర్ ప్రదర్శన
సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలసి నడిచి, ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫాప్ డూప్లెసిస్.. సీఎస్కే అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అది ఎంతలా అంటే..? సీఎస్కే నుంచి వెళ్లిపోయి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ అయిన తర్వాత కూడా ఆయన్ను అనుసరించేంతగా అని చెప్పుకోవాలి. ఇందుకు నిదర్శనం బుధవారం కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చూసేందుకు సీఎస్కే ఫ్యాన్స్ కూడా వచ్చారు. నిజానికి ఐపీఎల్ లో ఆర్సీబీ, సీఎస్కే రెండూ ప్రత్యర్థులుగా పనిచేస్తుంటాయి. అయినా సీఎస్కే అభిమానులు ఇప్పటికీ ఫాప్ డూప్లెసిస్ ను తమ అభిమాన ఆటగాడిగా చూస్తున్నట్టు నిరూపించారు.
‘‘మేము సీఎస్కే అభిమానులం. కానీ, ఇక్కడకు వచ్చింది ఫాప్ కోసం’’ అని రాయించిన పెద్ద బ్యానర్ ను వారు ప్రదర్శించడం కనిపించింది. అదే బ్యానర్ పై ఒకవైపు సీఎస్కే జెర్సీలో ఉన్న ఫాప్ చిత్రాన్ని.. మరోవైపు ఆర్సీబీ జెర్సీలో ఉన్న అతడి చిత్రాన్ని ప్రింట్ చేయించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతేడాది సీజన్ లో సీఎస్కే తరఫున ఫాప్ 633 పరుగులు సాధించడం గమనార్హం.