US: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు పెంచుకోవద్దు.. భారత్ కు అమెరికా హెచ్చరిక

US warns India against increasing oil imports from Russia says great risk
  • ఆర్థిక ఆంక్షలకు కట్టుబడి ఉండాలి
  • గతంలో మాదిరే చమురు దిగుమతులు చేసుకుంటే ఓకే
  • కొనుగోళ్లను పెంచుకోకూడదు
  • అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి ప్రకటన
చౌక ధరకే భారత్ కు ముడి చమురు సరఫరా చేస్తామంటూ రష్యా ఆఫర్ ఇవ్వడం అగ్రరాజ్యం అమెరికాకు కంటగింపుగా వుంది. యుద్ధానికి పూర్వం ఉన్న బ్యారెల్ చమురు ధరపై 35 డాలర్ల తక్కువకే సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. 

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడంతో, ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో భారత్ వంటి మిత్ర దేశాలతో వాణిజ్య బంధాన్ని పెంచుకోవడంపై రష్యా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గెరీ లావ్రోవ్ గురువారం భారత్ పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ క్రమంలో భారత్ ను హెచ్చరిస్తూ అమెరికా ప్రకటన చేసింది.

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు పెంచుకోవద్దని అమెరికా కోరింది. భారత్ పెద్ద ముప్పును కొని తెచ్చుకుంటోందని వ్యాఖ్యానించింది. రష్యా చమురుపైనా ఆర్థిక ఆంక్షలను అమెరికా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు రష్యా ఇంధనంపై అమెరికా ఆర్థిక అంక్షలకు దిగలేదు. రష్యా నుంచి గతంలో మాదిరే భారత్ చమురు దిగుమతులు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ, వాటిని పెంచుకోవద్దన్నది అమెరికా అభిప్రాయంగా ఉంది. 

‘‘ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న వినాశకర యుద్ధాన్ని ముగించే దిశగా ఆ దేశంపై ఒత్తిళ్లు తీసుకొచ్చేందుకు.. బలమైన ఉమ్మడి చర్యలు, కఠినమైన ఆంక్షల అవసరాన్ని మా భాగస్వామ్య దేశాలకు తెలియజేస్తూనే ఉన్నాం. వారు ఏ రూపంలో చెల్లించినా, ఏం చేసినా కూడా అది ఆంక్షలకు కట్టుబడి ఉండాలి. చమురు కొనుగోళ్లు పెంచుకోనంత వరకు మాకు అభ్యంతరం లేదు’’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. రష్యాతో భారత్ సంబంధాల పట్ల క్వాడ్ (జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా) కూటమిలోని అమెరికా, ఆస్ట్రేలియా సంతృప్తిగా లేవని తెలుస్తోంది.
US
warns
india
russia
crude

More Telugu News