Singapore: చివరి అవకాశమూ మూసుకుపోయి.. సింగపూర్‌లో ఉరికంబానికి చేరువైన భారత సంతతి యువకుడు

Singapore court rejects intellectually disabled mans final appeal against execution

  • 2009లో 43 గ్రాముల హెరాయిన్‌తో పట్టుబడిన ధర్మలింగం
  • సింగపూర్ చట్టాల ప్రకారం 15 గ్రాములకు మించితే మరణశిక్షార్హం
  • శిక్ష అమలుకు రెడీ అవుతున్న అధికారులు
  • మరికొన్ని రోజులు ఆగాలంటున్న బ్రిటన్ హక్కుల సంఘం డైరెక్టర్

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తికి సింగపూర్‌లో ఉరిశిక్ష ఖరారైంది. అతడు పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తు తిరస్కరణకు గురికావడంతో ఉరికంబం ఎక్కడం తప్పేలా కనిపించడం లేదు. 

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కె.ధర్మలింగం (34) 2009లో 43 గ్రాముల హెరాయిన్ ప్యాకెట్‌ను అక్రమంగా తీసుకొస్తూ సింగపూర్ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో అతడికి 2010లో సింగపూర్ హైకోర్టు మరణశిక్ష విధించింది. అయితే, తన వయసు, మానసిక పరిపక్వత లేమిని పరిగణనలోకి తీసుకుని తీర్పును మరోమారు పరిశీలించాలంటూ నాగేంద్రన్ పెట్టుకున్న దరఖాస్తులను కోర్టులు పలుమార్లు కొట్టేశాయి. 

దీంతో అతడు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశాడు. అయితే, ఇక్కడ కూడా అతడికి ఎదురుదెబ్బే తగిలింది. అతడి క్షమాభిక్ష పిటిషన్‌ను సింగపూర్ అప్పీళ్ల కోర్టు నిన్న కొట్టివేయడంతో ధర్మలింగానికి ఉన్న ఒకే ఒక్క అవకాశమూ మూసుకుపోయింది. మరికొన్ని రోజుల్లోనే అతడు ఉరికంబం ఎక్కనున్నట్టు న్యాయవాది తెలిపారు. 

అయితే, సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్ అతడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉందని, కాబట్టి మరికొన్ని రోజులు ఆగాలని బ్రిటన్‌కు చెందిన హక్కుల సంఘం ‘రిప్రీవ్’ డైరెక్టర్ మాయా ఫోవా విజ్ఞప్తి చేశారు. కాగా, సింగపూర్ చట్టాల ప్రకారం 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌తో పట్టుబడడం మరణశిక్షార్హం.

  • Loading...

More Telugu News