Rajasthan Royals: ఐపీఎల్ చరిత్రలో మరో చెత్త రికార్డు మూటగట్టుకున్న హైదరాబాద్

SRH register lowest ever powerplay score in IPL history
  • రాజస్థాన్ చేతిలో ఓడిన విలియమ్సన్ సేన ఖాతాలో మరో చెత్త రికార్డు
  • పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసిన హైదరాబాద్
  • రాజస్థాన్ అతి చెత్త రికార్డును భర్తీ చేసిన ఎస్ఆర్‌హెచ్
రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో అతి తక్కువ పరుగులు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 211 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విలియమ్సన్ సేన రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు కకావికలైంది. 

పరుగులు పిండుకోవాల్సిన పవర్ ప్లేలో అతి తక్కువ పరుగులు సాధించింది. తొలి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ పవర్‌ ప్లేలో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 2009లో కేప్‌టౌన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే చెత్త రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును హైదరాబాద్ భర్తీ చేసింది.

ఆ తర్వాతి మూడు స్థానాల్లోనూ వరుసగా చెన్నై సూపర్ కింగ్స్ ఉండడం గమనార్హం. 2011లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 15/2, 2015లో డీసీతో జరిగిన మ్యాచ్‌లో 16/1, 2019లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 16/1 స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో పవర్‌ ప్లేలో నమోదైన అత్యల్ప స్కోర్లు ఇవే.
Rajasthan Royals
Sunrisers Hyderabad
IPL 2022

More Telugu News