BJP: ఒకే ఫ్రేమ్‌లో ఆ ఐదుగురు!.. ఫొటో తీసిందెవ‌రంటే..!

up cm yogi adityanath swearing in seremony smriti irani clicks a rare photo
  • యోగి ప్ర‌మాణానికి బీజేపీ కీల‌క నేత‌లు
  • ఐదుగురు కీల‌క నేత‌లున్న ఫొటోను తీసిన స్మృతి ఇరానీ
  • పొద్దున్నే పేప‌ర్ల‌లో ఏఎన్ఐ ఫొటోగా ప్రచురితం
  • తాను ఫొటో తీస్తే.. క్రెడిట్ ఏఎన్ఐకి వెళ్లింద‌న్న మంత్రి
శుక్ర‌వారం నాడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్య‌నాథ్ వ‌రుస‌గా రెండో సారి ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌లంతా క్యూ క‌ట్టారు. ప్ర‌ధాని మోదీతో స‌హా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర హోం, ర‌క్ష‌ణ‌, ర‌హ‌దారుల శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రీలు కూడా ఈ వేడుక‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ ఐదుగురు నేత‌లు వ‌రుస‌గా కూర్చున్న ఫొటోను అదే పార్టీకి చెందిన ఓ కీల‌క నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్లిక్ మ‌నిపించారు. 

వివిధ ప్రాంతాల నుంచి తొలి త‌రం నేతలుగా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన ఈ ఐదుగురిలో మోదీ మిన‌హా మిగిలిన న‌లుగురూ బీజేపీ జాతీయ అధ్య‌క్షులుగా ప‌నిచేసిన వారే. వారిలో జేపీ న‌డ్డా ప్ర‌స్తుతం పార్టీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. ఇదే అంశాన్ని తెలియ‌జేస్తూ శ‌నివారం నాటి సంచిక‌ల్లో ప‌లు ప‌త్రిక‌లు ఈ ఫొటోను హైలైట్ చేస్తూ క‌థ‌నాలు రాశాయి. అయితే ఆ ఫొటోను మాత్రం ఏఎన్ఐ తీసిన‌ట్లుగా ఆయా ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. 

యోగి ప్ర‌మాణ స్వీకారంలో బిజీగా ఉన్నా.. ఈ ఆస‌క్తిక‌ర‌మైన దృశ్యాన్ని త‌న మొబైల్‌లో చిత్రీక‌రించిన స్మృతి ఇరానీ.. ఆ త‌ర్వాత దానిని అంత‌గా ప‌ట్టించుకోలేదు. అయితే తీరా శ‌నివారం ఉద‌యం ప‌త్రిక‌లు చూసిన స్మృతి ఈ ఫొటో కింద సోర్స్‌ను చూసి షాక్ తిన్నార‌ట‌. అరెరే.. ఫొటో నేను తీస్తే క్రెడిట్ ఏఎన్ఐ ఖాతాలో ప‌డిపోయిందే ఆని ఆమె బాధ‌ప‌డ్డారు. ఇదే విషయాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు.
BJP
Yogi Adityanath
Narendra Modi
JP Nadda
Amit Shah
Rajnath Singh
Nitin Gadkari
Smriti Irani
ANI

More Telugu News