RRR: ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల వివాదం.. అధికార పార్టీ నేతలకే అధిక టికెట్లు ఇచ్చారంటూ ఆరోపణలు!

RRR Movie Ruling party leaders allegedly taken lot off tickets
  • భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’
  • విశాఖలో నాలుగైదు రోజుల ముందే ఆన్‌లైన్‌లో టికెట్లు బంద్
  • విజయవాడలో అధికారపార్టీ నేతకు, థియేటర్ మేనేజర్‌కు మధ్య ఘర్షణ
  • రాష్ట్రంలోని పలు చోట్ల ఇలాంటి ఘటనలే 
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ నిన్న విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. గంటల కొద్దీ క్యూలలో నిల్చున్నా చాలామందికి టికెట్లు దొరక్క నిరాశగా వెనుదిరిగారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు దాదాపు ప్రతి థియేటర్ వద్ద కనిపించాయి. అయితే, ఇలా టికెట్లు దొరక్కపోవడానికి కారణం అధికార పార్టీ నాయకులేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారు పెద్ద సంఖ్యలో టికెట్లు తీసుకోవడంతో క్యూలో ఉన్న వారికి టికెట్లు లభించలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

విశాఖపట్టణంలోని చాలా థియేటర్లు ఆన్‌లైన్‌లో చాలా తక్కువ టికెట్లు విక్రయించాయని, మిగిలిన వాటిని సిఫార్సులపై ఇచ్చేశారని చెబుతున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా థియేటర్ యాజమాన్యాలే బ్లాక్‌లో టికెట్లను విక్రయించాయని మండిపడుతున్నారు.

అంతేకాదు, విశాఖపట్టణంలో అయితే నాలుగు రోజుల ముందే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాన్ని ఆపేశారని ఆరోపిస్తున్నారు. ఇక, టికెట్ల కోసం విజయవాడలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతకు, థియేటర్ మేనేజర్‌కు మధ్య టికెట్ల విషయంలో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే, విశాఖలోని పరవాడ మండలంలో మొదటి ఆట కోసం పలు పార్టీల నేతలకు వంద చొప్పున టికెట్లు కేటాయించినట్టు చెబుతున్నారు.
RRR
NTR
Ramcharan
Visakhapatnam
Vijayawada
YSRCP

More Telugu News