Vijayashanti: మొన్న ఆర్టీసీ చార్జీల పెంపు, నేడు విద్యుత్ చార్జీలు... ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయం: విజయశాంతి
- కరెంటు చార్జీలు పెంచారంటూ విజయశాంతి ఆగ్రహం
- ప్రభుత్వమే వేల కోట్ల బకాయిలు చెల్లించాలని వెల్లడి
- పాతబస్తీలో వసూలు చేసే దమ్ములేదని విమర్శలు
- ఆ భారం ప్రజలపై మోపుతున్నారని ఆరోపణ
తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. నిన్నగాక మొన్న ఆర్టీసీ చార్జీల పెంచిన సర్కారు, నేడు విద్యుత్ చార్జీలతో షాకిచ్చిందని విమర్శించారు. పేదలను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడం ఖాయమని అన్నారు. కేసీఆర్ సర్కారుకు పోయేకాలం దగ్గరపడిందని, అందుకే ప్రజలపై కరెంటు చార్జీల పెంపుతో మోయలేని భారాన్ని వేసిందని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం డిస్కమ్ లకు కట్టాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని విజయశాంతి ఆరోపించారు. డిస్కమ్ లకు వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.17 వేల కోట్లు కాగా... అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలు రూ.12,598 కోట్లు అని, ఇతర వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,603 కోట్లు అని పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవే ఉన్నాయని విజయశాంతి స్పష్టం చేశారు.
తాజాగా కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ నేడు అన్ని జిల్లాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం తన శాఖలు వాడుకున్న విద్యుత్ కు బిల్లులు చెల్లించడంలేదని, మరోవైపు పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేసే దమ్ము చూపించడంలేదని విమర్శించారు. ఈ లోటును పూడ్చేందుకు ప్రజలపై భారం మోపడం ఎంతవరకు న్యాయమని విజయశాంతి ప్రశ్నించారు.