Rohit Sharma: పర్మెనెంట్ ఓపెనర్ ఎవరో చెప్పిన రోహిత్ శర్మ

Rohit Says He Opens The Innings with Ishan Kishan in Upcoming IPL Season
  • ఐపీఎల్ వేలంలో డికాక్ ను వదులుకున్న ముంబై
  • ఇకపై ఇషాన్ కిషన్ ఓపెనర్ గా వస్తాడన్న కెప్టెన్
  • కొత్త బౌలింగ్ దళంపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించి ముంబై ఇండియన్స్ ను అంతెత్తులో నిలబెట్టాడు కెప్టెన్ రోహిత్ శర్మ. తాజా ఐపీఎల్ వేలంలో చాలా మంది పాత ప్లేయర్లను ఆ జట్టు వదిలేయాల్సి వచ్చింది. అందులో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఒకడు. అయితే, ఇప్పుడు జరగబోయే ఐపీఎల్ లో రోహిత్ ఎవరితో కలిసి ఓపెనింగ్ చేస్తాడన్న ఆసక్తికర ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలోనే దానికి అతడు జవాబిచ్చాడు. 

కచ్చితంగా తన ఓపెనింగ్ స్థానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశాడు. గతం నుంచే తాను ఓపెనింగ్ చేస్తున్నానని, ఇప్పుడు కూడా అందులో మార్పు ఉండదని తేల్చి చెప్పాడు. ఇకపై ఇషాన్ కిషన్ తో కలిసి ఓపెనింగ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని రోహిత్ తెలిపాడు. 

ఇక టైమల్ మిల్స్, జయదేవ్ ఉనాద్కత్ లు జట్టుకే కొత్తగానీ.. ఆటకు కాదని పేర్కొన్నాడు. చాలా ఏళ్లుగా ఆడుతున్నారని, ఏం చేయాలో వారికి బాగా తెలుసని చెప్పాడు. జట్టుగా వాళ్లు ఏం చేయగలరో, ఏం చేయాలో చెప్పాల్సిన బాధ్యత కూడా తమపై ఉంటుందని చెప్పాడు. గతంలో ఇద్దరూ వేరే ఫ్రాంచైజీలకు ఆడారని, ఇప్పుడు తమకు తగ్గట్టుగా వారిని మలచుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ వివరించాడు. 

కాగా, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడీ చాలా బాగుంటుందని ముంబై హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పేర్కొన్నాడు. వికెట్ కీపర్ అయిన ఆటగాళ్లకు టాప్ 3లో బ్యాటింగ్ చేసే అవకాశం రావడం చాలా అరుదన్నాడు.
Rohit Sharma
Ishan Kishan
Cricket
IPL

More Telugu News