Bangladesh: దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

Bangladesh Script History With Maiden Bilateral ODI Series Win In South Africa
  • మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్
  • సఫారీ గడ్డపై బంగ్లాకు తొలి సిరీస్ విజయం
  • చివరి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించిన బంగ్లా
దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత సాధించింది. సిరీస్ విజయాన్ని నిర్ణయించే చివరిదైన మూడో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెంబా బవుమా సేన.. బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ధాటికి కుప్పకూలింది. అతడి దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. తస్కిన్ 35 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా 37 ఓవర్లలో 154 పరుగులకే దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. ప్రొటీస్ బ్యాటర్లలో జానెమన్ మలాన్ చేసిన 39 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. కేశవ్ మహారాజ్ 28, డ్వైన్ ప్రెటోరియస్ 20 పరుగులు చేశారు. షకీబల్ హసన్ 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్లు లిటన్ దాస్ (48), కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (87) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 20.5 ఓవర్లలో 127 పరుగులు జోడించారు. అనంతరం లిటన్ దాస్ అవుట్ కాగా, క్రీజులోకి వచ్చిన షకీబల్ హసన్ 18 పరుగులు చేసి మిగతా పని పూర్తి చేశాడు. ఫలితంగా 9 వికెట్ల భారీ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తస్కిన్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. బంగ్లాదేశ్ చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Bangladesh
South Africa
One Day
Taskin Ahmed

More Telugu News