Kadapa District: పెట్రోలు బంకు కోసం కడపలో అర్ధరాత్రి అన్న క్యాంటీన్ కూల్చివేత

Anna Canteen In kadapa demolished
  • టీడీపీ హయాంలో రూ.30 లక్షలతో నిర్మాణం
  • రోజూ 500 మందికి ఆహారం 
  • భవనంలోని విలువైన సామాన్లను కూడా తీయకుండా కూల్చివేత
  • టీడీపీ నేతల ఆందోళన

కడపలో అర్ధరాత్రి వేళ అన్న క్యాంటీన్‌ను అధికారులు కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేదలకు అతి తక్కువ ధరకు అల్పాహారం, భోజనం అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నిర్వహించింది. కడపలోనూ రూ. 30 లక్షల వ్యయంతో దీనిని నిర్మించింది. అప్పట్లో రోజూ 500 మందికి ఇది కడుపు నింపేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ల నిర్వహణను పూర్తిగా ఆపేశారు. కరోనా సమయంలో కడప క్యాంటీన్‌ను కొవిడ్ కేంద్రంగా మార్చారు. 

అయితే, సోమవారం అర్ధరాత్రి ఈ భవనాన్ని అకస్మాత్తుగా కూల్చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంటీన్‌లోని విలువైన, ఉపయోగపడే వస్తువులను కూడా బయటకు తీయకుండా అలాగే కూల్చివేయడం విమర్శలకు దారితీసింది. విషయం తెలిసిన టీడీపీ కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు నేతృత్వంలో నేతలు ఆందోళనకు దిగారు. 

కూల్చివేసిన క్యాంటీన్ ప్రాంతంలో నగరపాలక సంస్థ పెట్రోలు బంకు ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ రంగస్వామి తెలిపారు. కాగా, పెట్రోలు బంకు ఏర్పాటు కోసం నగరంలో బోల్డన్ని ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ అన్న క్యాంటీన్‌ భవనాన్ని కూల్చడం దారుణమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News