Kannababu: కేసును ఎదుర్కొనేందుకు నారా లోకేశ్ సిద్ధంగా ఉండాలి: మంత్రి కన్నబాబు

Nara lokesh has to get ready to face case says Kannababu
  • పెగాసస్ వ్యవహారంలో ఉత్తరకుమార ప్రగల్భాలు మానాలి
  • హౌస్ కమిటీ విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి
  • ఏ కేసులోనైనా స్టే తెచ్చుకోవచ్చనే ధైర్యంతో బతుకుతున్నారన్న మంత్రి 

పెగాసస్ వ్యవహారంలో టీడీపీ నేత నారా లోకేశ్ ఉత్తరకుమార ప్రగల్భాలు మానాలని... కేసును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. పూర్తి ఆధారాలతో దొరికిపోవడం ఖాయమని, కోర్టులో స్టే కూడా రాదని అన్నారు. ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో వైసీపీ నేతలు, ఐఏఎస్ అధికారులు, సినిమా యాక్టర్లు, సామాన్య ప్రజల ఫోన్లను ట్యాపింగ్ చేసి, వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారని విమర్శించారు. 

పెగాసస్ పై అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయని చెప్పారు. రోడ్లపై చంద్రబాబు, శాసనమండలిలో నారా లోకేశ్ సవాళ్లు విసరడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఏ కేసులో అయినా స్టే తెచ్చుకోవచ్చనే ధైర్యంతో వాళ్లు బతుకుతున్నారని అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో కూడా చిన్న పిల్లాడిలా సవాళ్లు విసరడం సరికాదని లోకేశ్ కు సూచించారు.

  • Loading...

More Telugu News