Kerala: 50 సెంట్ల భూమి కోసం.. తప్పించుకునే వీలులేకుండా చేసి కుమారుడి కుటుంబాన్ని మట్టుబెట్టిన తండ్రి

Father set fire to son family died four in kerala
  • కేరళలోని ఇడుక్కిలో ఘటన
  • ఎవరూ తప్పించుకోకుండా ప్లాన్ వేసిన తండ్రి
  • ఆదమరిచి నిద్రపోతున్న కుమారుడి కుటుంబం ఆహుతి
బంధాలు, బంధుత్వాలు అన్నీ ట్రాష్ అని, అవన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతాయని నిరూపించే మరో ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలోని చీనికుళిలో జరిగింది. కేవలం 50 సెంట్ల భూమి కోసం కన్న కుమారుడి కుటుంబాన్నే సజీవ దహనం చేశాడో 79 ఏళ్ల ముసలి తండ్రి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు హమీద్‌కు కుమారుడు ఫైజల్‌తో 50 సెంట్ల భూమి విషయంలో గొడవలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం కుమారుడికి రాసిచ్చిన ఈ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇందుకు ఫైజల్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. 

తాను ఇచ్చిన భూమిని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన కుమారుడిపై హమీద్‌ కక్షగట్టాడు. కుటుంబం మొత్తాన్ని పెట్రోలు పోసి సజీవ దహనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఎవరూ తప్పించుకోకుండా ప్లాన్ వేశాడు. ఆ సమయంలో వారికి ఎవరి సాయమూ అందకుండానూ జాగ్రత్త పడ్డాడు. ఇంటిపైనున్న నీళ్ల ట్యాంకును ఖాళీ చేశాడు. బయట నుంచి నీళ్లు పోసి మంటలను ఆర్పేస్తారేమోనన్న అనుమానంతో బావివద్దనున్న తాడు, బొక్కెనను కూడా తీసేశాడు. ఇంటి బయట గడియపెట్టాడు. కిటికీలోంచి పెట్రోలు నింపిన బాటిళ్లను లోపలికి విసిరాడు. ఆపై అగ్గిపుల్ల వెలిగించాడు. 

అంతే క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. ఆదమరచి నిద్రపోతున్న కుమారుడు ఫైజల్, కోడలు షీబా, మనవరాళ్లు మెహర్, అస్నా అగ్నికి ఆహుతి అవుతుంటే బయటనుంచి వికృతానందం పొందాడు. కాలిబూడిదైన మృతదేహాలను చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Kerala
Idukki
Murders
Crime News

More Telugu News