USA: యూఎస్ అధ్యక్ష పదవి రేసులో భారతీయ అమెరికన్.. డెమోక్రాట్లలో పెరిగిన మద్దతు

Ro Khanna In Race Of US Presidential Bid
  • 2024లో బైడెన్ నిలబడకుంటే రో ఖన్నాకు చాన్స్
  • ఇప్పటికే మద్దతు ప్రకటించిన శాండర్స్ వర్గం
  • పోటీలో నిలబడేందుకు రో ఖన్నాతో చర్చలు
  • బైడెన్ పై డెమోక్రాట్ గవర్నర్లు, సెనేటర్లు, ప్రతినిధుల నుంచి వ్యతిరేకత
  • ఆయన వయసు పెరిగిందంటూ చర్చలు
ఇటీవలి కాలంలో అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలున్న వారూ కీలకంగా మారారు. కీలక పదవులు దక్కించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆ దేశ ఉపాధ్యక్షురాలుగా భారతీయ అమెరికన్ అయిన కమలా హారిస్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో భారతీయ అమెరికన్ ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారంటే నమ్ముతారా? కానీ, అదే నిజం. 

భారతీయ మూలాలున్న రో ఖన్నా అధ్యక్ష పదవికి రేసులో నిలిచారు. 2024 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రెండో టర్మ్  కోసం పోటీ చేయకపోతే.. రో ఖన్నాను అధ్యక్షుడిగా బరిలోకి దించాలని బెర్నీ శాండర్స్ వర్గం పావులు కదుపుతోంది. ఇప్పటికే రో ఖన్నాకు మద్దతు కూడా ప్రకటించింది. అలాగే, ఇప్పటికే ఈ విషయంపై శాండర్స్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ మేనేజర్ జెఫ్ వీవర్, శాండర్స్ సీనియర్ సలహాదారు మార్క్ లాంగాబా.. ఖన్నాతో చర్చించినట్టు తెలుస్తోంది. 

అయితే, ఈ విషయంపై బహిరంగంగా చర్చించేందుకు డెమోక్రాట్ పార్టీ నేతలు ఇష్టపడడం లేదు. అయితే, బైడెన్ అనుకూల వర్గం మాత్రం.. ఆయన ఆరోగ్యం సహకరిస్తే రెండో సారి కూడా అధ్యక్ష రేసులో ఉంటారని అంటోంది. ఇటు కమలా హారిస్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నా.. ఈసారి ఆమె కచ్చితంగా గెలవదని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. 

ఇటు కొందరు డెమోక్రాట్ పార్టీ గవర్నర్లు, సెనేటర్లు, హౌస్ సభ్యులు బైడెన్ అభ్యర్థిత్వంపై ఇప్పటికే పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు వయసు మీద పడిందని, ప్రస్తుతం 79 ఏళ్ల వయసున్న ఆయన.. మరో రెండేళ్లంటే 81 ఏళ్లకు వస్తారని చెబుతున్నారు. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వకూడదని వారంతా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. 

ఈ క్రమంలోనే రో ఖన్నా పేరును తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. అన్ని విధాలుగానూ రో ఖన్నా సమర్థవంతమైన వ్యక్తిగా చెబుతున్నారు. అన్ని వర్గాల్లోనూ ఆయనకు మద్దతు ఉందని లాంగాబా అంటున్నారు. అయితే, ఓ ఇంటర్వ్యూలో మాత్రం అభ్యర్థిత్వం కోసం బైడెన్ తో తాను పోటీ పడనని ఖన్నా అన్నారు. బైడెన్ నిలబడితే ఆయనకే తాను మద్దతిస్తానని అన్నారు. అవసరమైతే 2024 తర్వాత ఆలోచిస్తానని చెప్పారు. 

అయితే, రో ఖన్నాపై ప్రజలకు విశ్వాసం ఎంత అనే దాని మీద మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 40 లక్షల హిందూ అమెరికన్ ఓట్లు, 50 లక్షల ముస్లిం అమెరికన్ ఓట్లు పడతాయని అంటున్నారు. అయితే, ఆయన హిందూత్వకు పూర్తి వ్యతిరేకం కావడంతో.. అమెరికాలోని హిందువుల ఓట్లు పడతాయా? అని కొందరు సందేహలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభకు కాలిఫోర్నియా నుంచి ఆయన ఎన్నికయ్యారు.
USA
President
Joe Biden
Ro Khanna

More Telugu News