Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. దక్షిణాఫ్రికాపై తొలి విజయం!
- దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్
- తొలి వన్డేలో 38 పరుగుల తేడాతో విజయం
- 314 పరుగుల భారీ స్కోరు సాధించిన బంగ్లాదేశ్
- బంగ్లా బౌలర్ల దెబ్బకు లక్ష్య ఛేదనలో కుప్పకూలిన సఫారీలు
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో నిన్న తొలిసారి ఆ జట్టుకు ఓ అద్భుత విజయం లభించింది. దక్షిణాఫ్రికాపై అందని ద్రాక్షగా మారిన విజయాన్ని తొలిసారి రుచి చూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. షకీబల్ హసన్ (77), లిటన్ దాస్ (50), యాసిర్ అలీ (50) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 314 పరుగులు భారీ స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు.
ఆ తర్వాత భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో 276 పరుగులకే ఆలౌట్ ఓటమిని మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ 61 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును దారుణంగా దెబ్బతీశాడు. తస్కిన్ అహ్మద్ 3, షొరిఫుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో రాసీ వాన్‌డెర్ డుసెన్ (86), డేవిడ్ మిల్లర్ (79) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వారు క్రీజులో ఉన్నంత సేపు విజయంపై ఆశలు రేగినా ఆ తర్వాత మాత్రం వికెట్లు టపటపా రాలిపోవడంతో ఓటమి తప్పలేదు. 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షకీబల్ హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.