Virat Kohli: కెప్టెన్సీ భారాన్ని తొలగించుకున్న కోహ్లీతో చాలా ప్రమాదం అంటున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్

  • ఏ ఫార్మాట్లోనూ కెప్టెన్ గా లేని కోహ్లీ
  • ఐపీఎల్ లోనూ కెప్టెన్సీ వదులుకున్న వైనం
  • కోహ్లీపై ఆర్సీబీ టీమ్ మేట్ మ్యాక్స్ వెల్ అభిప్రాయాలు
  • కోహ్లీ తనకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడని వెల్లడి
Australia all rounder Glenn Maxwell says captaincy relieved Kohli dangerous

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏ ఫార్మాట్ లోనూ కెప్టెన్ కాదు. కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎన్నో ఒత్తిళ్ల నడుమ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ లు ఆడి అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అయితే, ఇప్పుడు కెప్టెన్సీ లేకపోవడంతో కోహ్లీపై ఎలాంటి భారం లేదని, దాంతో అతడు ప్రత్యర్థుల పాలిట ప్రమాదకరంగా పరిణమిస్తాడని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ ఒత్తిళ్లు లేని కోహ్లీ ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు.

ఐపీఎల్ లో కోహ్లీ ఎన్నో ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, గత సీజన్ నుంచి మ్యాక్స్ వెల్ కూడా అదే టీమ్ కు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో, తన టీమ్ మేట్ సత్తాపై మ్యాక్స్ వెల్ ఇతర జట్లకు హెచ్చరికలు చేశాడు. 

"కోహ్లీని చాలాకాలంగా కెప్టెన్సీ భారం వెంటాడుతోంది. ఇప్పుడా సమస్య లేదు. అయితే ఇది ప్రత్యర్థి జట్లకు ఎంతమాత్రం మంచి వార్త కాదు. కోహ్లీ ఇంతకుముందు నువ్వెంత అంటే నువ్వెంత అనే తరహాలో ఉండేవాడు. ప్రస్తుత కోహ్లీని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎంతో కూల్ గా కనిపిస్తున్నాడు. మరికొన్నాళ్లపాటు ఆటను హాయిగా ఆస్వాదిస్తాడనిపిస్తోంది" అని మ్యాక్స్ వెల్ పేర్కొన్నాడు. 

అంతేకాదు, కోహ్లీతో క్రికెట్ కు సంబంధించిన అంశాలను మాట్లాడడాన్ని ఎంతో ఇష్టపడతానని, అన్నిటికంటే ముఖ్యంగా కోహ్లీ తనకు క్లోజ్ ఫ్రెండ్ గా మారడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు.

More Telugu News