Vladimir Putin: పుతిన్ ఇంత పని చేస్తాడనుకోలేదు: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

Vladimir Putin Very Much Changed says Donald Trump
  • అప్పటికీ ఇప్పటికీ పుతిన్ లో చాలా మార్పు వచ్చింది 
  • సరిహద్దులకు సైన్యాన్ని పంపిస్తుంటే చర్చలకే అనుకున్నా
  • నేను యూఎస్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా దాడికి దిగేది కాదన్న ట్రంప్ 
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనిక చర్య పేరుతో రష్యా తమ బలగాలను సరిహద్దులకు పంపిస్తుంటే చర్చలకేనని తాను భావించానని, కానీ పొరుగుదేశంపై యుద్ధానికి దిగడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. 

‘వాషింగ్టన్ ఎగ్జామినర్’ అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే పుతిన్‌లో ఎంతో మార్పు వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుతిన్ ఇలా మారిపోవడం బాధాకరమైన విషయమన్నారు. 

అమెరికాతో అందరూ చేసుకుంటున్నట్టుగానే పుతిన్ కూడా ఉక్రెయిన్‌తో మంచి ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారని భావించానని అన్నారు. కానీ ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడం తనను నిజంగానే ఆశ్చర్యపరిచిందన్నారు. పుతిన్ నిజంగానే మారిపోయారన్నారు. తాను కనుక అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేసి ఉండేది కాదని అన్నారు.

కాగా, ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పుతిన్‌తో మంచి సంబంధాలు ఉండేవి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగినప్పుడు ఖండించకపోవడంతో ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తీవ్రంగా ఖండించారు. ఆ దేశంపై పలు కఠిన ఆంక్షలు విధించారు.
Vladimir Putin
Russia
Ukraine
Donald Trump
USA

More Telugu News