Telangana: తెలంగాణలో నేడు, రేపు వడగాలులు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
- అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- నల్గొండలో నిన్న 42.4 డిగ్రీల నమోదు
- పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి
- గాలిలో తేమ తగ్గి ఉక్కపోతలు ప్రారంభం
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సాధారణం కంటే 6-7 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. ఫలితంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. రాష్ట్రంలో నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండలో నిన్న సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో నల్గొండలో మార్చి నెలలో నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే. అంతకుముందు 2016లో మార్చి 23న 42 డిగ్రీలు నమోదైంది.
ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ తదితర ప్రాంతాల్లోనూ నిన్న 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు మధ్యాహ్నం పూట అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, గాలిలో తేమ తగ్గిపోవడంతో వాతావరణం పొడిగా మారి ఉక్కపోత ఎక్కువైనట్టు పేర్కొన్నారు.