ROHIT SHARMA: 40 నిమిషాల్లో గేమ్ ను మార్చేయగలడు.. పంత్ పై రోహిత్ ప్రశంసలు
- ఆటకు పదును పెడుతున్నాడు
- బ్యాటింగ్ లో స్వేచ్ఛ ఇస్తున్నాం
- వికెట్ కీపింగ్ బాగా చేశాడు
- నేను చూసినంత వరకు ఇదే బెస్ట్ అన్న కెప్టెన్
వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో భారత్ సొంతం చేసుకోవడం తెలిసిందే. రెండు టెస్ట్ లలో పంత్ 185 పరుగులు సాధించాడు. ఒక మ్యాచ్ లో 90 పరుగులు, మరొక మ్యాచ్ లో 50 పరుగులు చేసి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టడం తెలిసిందే.
పంత్ ఆటతీరును మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ప్రస్తావించాడు. ఆటను వేగంగా మార్చేయగల సమర్థుడు అతడని కొనియాడాడు. ఆటతీరును మెరుగుపరుచుకున్నట్టు చెప్పాడు. ‘‘అతడి బ్యాటింగే వేరు. ఒక జట్టుగా బ్యాట్ విషయంలో అతడికి స్వేచ్ఛ ఇవ్వాలన్నది మా ఉద్దేశ్యం. కొన్ని సందర్భాల్లో ఆ షాట్ ను అతడు ఎందుకు ఆడాడు అనే సందేహం వస్తుంది. కానీ, దాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఆట ఫలితాన్ని 40 నిమిషాల్లోనే అతడు మార్చేయగలడు’’ అని రోహిత్ తెలిపాడు.
వికెట్ కీపింగ్ నైపుణ్యాలను కూడా పంత్ మెరుగుపరుచుకున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు. ‘‘ఈ సిరీస్ లో ముఖ్యమైన అంశం అతడి కీపింగే. నేను చూసినంత వరకు అతడి అత్యుత్తమ వికెట్ కీపింగ్ ఇదే. వికెట్ కీపింగ్ చేసిన ప్రతిసారి మెరుగుపడుతున్నాడు. నాకు ఎంతో నచ్చిన అంశం అది’’ అని రోహిత్ చెప్పాడు.