Gorantla Butchaiah Chowdary: నాటుసారా వల్ల ఇప్పటికే వందల మంది చనిపోయారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల
- నాటుసారా వల్ల జంగారెడ్డి గూడెంలో మరణాలు
- అదే మాదిరిగా ఏపీలో చాలా మంది చనిపోతున్నారు
- రాష్ట్రంలో నకిలీ బ్రాండ్లను విక్రయించకూడదు
- ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేయట్లేదన్న నేతలు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా కారణంగా వరుసగా మరణాలు సంభవిస్తోన్న విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 18కి పెరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
ఈ రోజు టీడీపీ మంగళగిరిలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో వారు పాల్గొని మాట్లాడారు. నాటుసారా వల్ల జంగారెడ్డి గూడెం మాదిరిగా ఏపీలో చాలా మంది చనిపోతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో నకిలీ బ్రాండ్లను విక్రయించకూడదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాటుసారా కారణంగా వందల మంది చనిపోయారని ఆరోపించారు.
నాటుసారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నిస్తోందని నిమ్మల రామానాయుడు విమర్శించారు. మద్యనిషేధం అమలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని చెప్పారు.