sp: ఎంపీగానే కొనసాగాలని అఖిలేశ్ యాదవ్ అనూహ్య నిర్ణయం

SP leaders Akhilesh Yadav Azam Khan likely to continue as Lok Sabha members
  • అజంగఢ్ లోక్ సభ ఎంపీగా ఉన్న అఖిలేశ్
  • కర్హాల్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక
  • మరో ఎంపీ అజంఖాన్ కూడా ఎమ్మెల్యేగా విజయం
  • లోక్ సభలో ఎస్పీకి ఐదుగురు సభ్యులే
  • దీంతో అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చి.. చివరికి 125 అసెంబ్లీ సీట్లను సాధించిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా లోక్ సభ సభ్యుడిగానే కొనసాగాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం.

అఖిలేశ్ యాదవ్ అజంగఢ్ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన అత్యంత సన్నిహితుడైన అజంఖాన్ రాంపూర్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. అయినా ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేసి గెలిచారు. అఖిలేశ్ యాదవ్ కర్హాల్ స్థానం నుంచి, అజంఖాన్ రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో నిబంధనల ప్రకారం వారు ఏదో ఒక స్థానాన్ని అట్టి పెట్టుకోవాలి. అయితే ఎంపీ లేదా ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీలుంటుంది.

వీరిద్దరూ అసెంబ్లీకి వెళితే.. లోక్ సభలో ఎస్పీ పాత్ర మరింత తగ్గిపోతుంది. ఎస్పీకి ప్రస్తుత లోక్ సభలో కేవలం ఐదుగురు సభ్యులే ఉన్నారు. వారిలో అఖిలేశ్, అజంఖాన్ కూడా భాగమే. ప్రస్తుత రాజకీయ వాతావరణం నేపథ్యంలో లోక్ సభలో తమ ప్రాతినిధ్యం తగ్గిపోవడం ఎస్పీకి ఇష్టం లేదు. దీంతో అఖిలేశ్, అజంఖాన్ ఎంపీలుగానే కొనసాగనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

వీరు తమ శాసనసభ సభ్యత్వాలను వదులుకోనున్నారు. కొంత వ్యవధి తర్వాత శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శివ్ పాల్ యాదవ్ కు ప్రతిపక్ష నాయకుడి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
sp
Akhilesh Yadav
azam khan
Lok Sabha members

More Telugu News