Delhi: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. విచారం వ్యక్తం చేసిన కేజ్రీవాల్!

Seven burnt alive in Delhi fire accident
  • గోకల్ పురి ప్రాంతంలో అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదం
  • అగ్నికి ఆహుతైన 60 గుడిసెలు
  • ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్తున్న కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో దాదాపు 60 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఏడుగురు అగ్నికీలల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ఢిల్లీలోని గోకల్ పురి ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది విశ్వప్రయత్నం చేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే కార్యక్రమం ఈ ఉదయం వరకు కొనసాగింది. 

మరోవైపు ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ప్రమాదానికి సంబంధించిన విషాదకర వార్తను విన్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్తున్నానని... బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పారు.
Delhi
Fire Accident
Arvind Kejriwal
AAP

More Telugu News