Indian Embassy: భారత విద్యార్థులు రష్యాను వీడాల్సిన అవసరంలేదు: భారత దౌత్య కార్యాలయం ప్రకటన

Indian embassy issues new guidelines for students in Russia
  • ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • స్పందించిన రష్యాలోని భారత ఎంబసీ
  • రష్యాలో ఉన్న భారత విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ
  • రష్యాలో ఆందోళనకర పరిస్థితులు లేవని స్పష్టీకరణ

ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో, రష్యాలోని భారత దౌత్య కార్యాలయం విద్యార్థులను ఉద్దేశించి తాజాగా ప్రకటన చేసింది. రష్యాలో విద్యాభ్యాసం చేస్తున్న భారత విద్యార్థులు ఇప్పటికిప్పుడు రష్యాను వీడాల్సిన పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. రష్యాలో ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని విద్యార్థులకు మరోసారి భరోసా ఇస్తున్నామని మాస్కోలోని భారత ఎంబసీ పేర్కొంది. 

భారత ఎంబసీ ప్రకటన సారాంశం ఇదే... 

"రష్యాలో ఉండాలా? వద్దా? అనే అంశంపై సలహా ఇవ్వాలంటూ మాస్కోలోని భారత ఎంబసీకి పెద్ద సంఖ్యలో సందేశాలు వస్తున్నాయి. మేం చెప్పేది ఏంటంటే.. ప్రస్తుతం రష్యాలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు. విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లనవసరంలేదని భావిస్తున్నాం. రష్యాలో ఉన్న భారత విద్యార్థులు, పౌరుల భద్రతపై సంబంధిత వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. 

అయితే, రష్యాలో బ్యాంకింగ్ రంగ సేవలు, డైరెక్ట్ విమాన సర్వీసులకు అంతరాయాలు ఉన్నమాట నిజమే. ఈ అంశాల పట్ల విద్యార్థులు ఎవరైనా ఆందోళన చెందుతుంటే వారు భారత్ వెళ్లిపోవచ్చు. 

విద్యాభ్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని చూసినట్టయితే... ఇప్పటికే అనేక యూనివర్సిటీలు తమ విద్యాబోధనను ఆన్ లైన్ డిస్టెన్స్ పద్ధతిలోకి మార్చినట్టు మాకు సమాచారం అందించాయి. ఈ విషయంలో భారత విద్యార్థులు తాము విద్యాభ్యాసం చేస్తున్న యూనివర్సిటీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. తద్వారా విద్యా సంవత్సరానికి ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవాలి" అని పేర్కొంది.

  • Loading...

More Telugu News