Arvind Kejriwal: చేతులెత్తి మొక్కుతున్నా మోదీజీ.. వెంటనే ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టండి: కేజ్రీవాల్ విజ్ఞప్తి

With Folded Hands I Request Modi To Make Elections Happen
  • ఆప్ వేవ్ ఉందని తెలిసే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా
  • అలా చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచినట్టేనన్న కేజ్రీవాల్  
  • పార్లమెంటరీ వ్యవస్థ అధ్యక్ష వ్యవస్థగా మారిపోయినా ఎన్నికలు పెట్టరా? అని నిలదీత
ఢిల్లీ రాజధానిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను వాయిదా వేస్తే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచినట్టేనన్నారు. 

ప్రస్తుతం ఢిల్లీలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. వాటన్నింటినీ విలీనం చేసే బిల్లును తెస్తామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అన్ని విషయాలనూ విశ్లేషించి ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

దీనిపైనే అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. విలీనం చేయాలనుకున్నప్పుడు ఈ ఏడేళ్లూ ఏం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పట్నుంచి కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా? అని నిలదీశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ వేవ్ ఉందన్న విషయం బీజేపీకి అర్థమైందని, ఇప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతామన్న భయంతోనే వాయిదా వేసిందని ఆరోపించారు. 

‘‘రేపు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తే అన్నీ కలిసి ఒకే ఆఫీసుగా మారిపోతాయి. ఉద్యోగులంతా ఒకే ఆఫీసులో పనిచేస్తారు. అలాంటి దాని కోసం ఎన్నికలను ఎందుకు వాయిదా వేయడం? రేపటినాడు భారత్ పార్లమెంటరీ వ్యవస్థ నుంచి అధ్యక్ష వ్యవస్థకు మారితే కూడా.. ఎన్నికలు పెట్టరా? రెండు రాష్ట్రాలను విలీనం చేస్తే కూడా ఎన్నికలు పెట్టరా?’’ అని ప్రశ్నించారు. 

ఎన్నికలు పెట్టాల్సిందిగా ప్రధాని మోదీకి చేతులెత్తి మొక్కుతున్నా అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, దేశమే ముఖ్యమని, రాజకీయ పార్టీలు కాదని అన్నారు. తాము ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి చేస్తే.. ఆ వ్యవస్థ బలహీనమవుతుందని అన్నారు. తాము వ్యవస్థలను బలహీన పరచలేమని, దాని వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని అన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలంటూ లేఖ అందిన గంటలోనే నిర్ణయం తీసుకున్నారని, అలా బలహీనపడిపోతే మన దేశానికే నష్టమని అన్నారు. 

‘‘మీపై ఈడీ దాడులో.. సీబీఐ విచారణో లేదంటే ఆదాయపుపన్ను అధికారుల దాడులంటూ మిమ్మల్ని బెదిరించైనా ఉండొచ్చు.. లేదంటే మరికొన్నాళ్లలో రిటైర్ కాబోతున్న మీకు ఆ తర్వాత మంచి పోస్టు ఇస్తామంటూ ఆశపెట్టి ఉండవచ్చు.. ఏదైనా సరే.. మీరు ఒత్తిళ్లకు తలొగ్గవద్దు’’ అంటూ ఎన్నికల కమిషనర్ కు కేజ్రీవాల్ సూచించారు.
Arvind Kejriwal
New Delhi
AAP
Elections
BJP
Narendra Modi

More Telugu News