Maryland: ప్రపంచంలోనే తొలిసారి పంది గుండె అమర్చుకున్న వ్యక్తి మృతి!

  • ఈ ఏడాది జనవరి 7న 57 ఏళ్ల బెన్నెట్‌కు పందిగుండె
  • జన్యు మార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను అమర్చిన వైద్యులు
  • ప్రపంచ వైద్య చరిత్రలోనే కీలక ముందడుగుగా అభివర్ణణ
  • రెండు నెలల్లోనే ముగిసిన సంతోషం
Maryland man who got first pig heart transplant dies after 2 months

ఈ ఏడాది జనవరి 7న వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ వ్యక్తికి పందిగుండె అమర్చి వైద్యులు సంచలనం సృష్టించారు. అయితే, వారి ఆనందం రెండు నెలల్లోనే ముగిసింది. ఆ వ్యక్తి తాజాగా మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్‌ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు. దీంతో దీనిని పెద్ద ముందడుగుగా భావించారు. 

అయితే, గత కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. 

1984లోనూ ఇలాంటి ప్రయోగమే జరగ్గా అది కూడా విఫలమైంది. ఓ రకం కోతి నుంచి సేకరించిన గుండెను బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా ఆయన 21 రోజులు మాత్రమే జీవించారు. అయితే, ఈసారి పందిగుండె అమర్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించడం కొంత మెరుగైన ఫలితమేనని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News