Andhra Pradesh: నా పెంపుడు చిరుత పులులు విడిచి రాలేను.. చావో, రేవో ఉక్రెయిన్ లోనే అంటున్న ఆంధ్రా డాక్టర్

Andhra Pradesh doctor with leopard jaguar does not want to leave war zone
  • భారత్ కు వస్తే నా చిరుత పులుల గతి ఏం కాను
  • అవి ఆకలితో చస్తాయి
  • ఆ పని నేను చేయలేను
  • ఇక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయ్
  • డాక్టర్ కుమార్ బండి ఆవేదన
యుద్ధ పరిస్థితులతో ఉక్రెయిన్ నుంచి వేలాది మంది భారత్ కు తిరిగొచ్చేశారు. కొందరు తమకు ప్రాణంగా భావించే పెంపుడు శునకాలు, పిల్లులను కూడా వెంట తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ దేశంలో మిగిలి ఉన్న భారతీయులు అతి కొద్ది మందే. వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ కుమార్ బండి కూడా ఒకరు. అందరి పరిస్థితి వేరు కుమార్ పరిస్థితి వేరు. 

ఎందుకంటే కుమార్ రెండు చిరుత పులులను పెంచుకుంటున్నారు. అందులో ఒకటి బ్లాక్ పాంథర్. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు 850 కిలోమీటర్ల దూరంలోని డాన్ బాస్ లో తన నివాసం కింద బంకర్ లోనే ఇప్పుడు కుమార్ తలదాచుకున్నారు. తన రెండు చిరుత పులులను ఇతరుల దయకు విడిచి పెట్టి రాలేనంటూ అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. 

కుమార్ యూట్యూబర్ కూడా. జాగ్వార్ కుమార్ తెలుగు పేరుతో యూ ట్యూబ్ చానల్ కూడా నిర్వహిస్తున్నారు. యుద్ధంతో నిద్ర లేకుండా, సరైన తిండి లేకుండా, తీవ్రమైన మంచు మధ్య పరిస్థితి దారుణంగా ఉన్నట్టు ఆయన తన యూట్యూబ్ చానల్ లో ఉంచిన తాజా వీడియోలో తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఎంతో మంది విద్యార్థులు బయటపడేందుకు ఆయన తన వంతు సహకారం అందించడం గమనార్హం. తాను సురక్షితంగా భారత్ కు చేరుకోగలను కానీ, తాను వెళ్లిపోతే తన పెంపుడు పులులు ఆకలితో చచ్చిపోతాయన్నారు. 

కుమార్ 15 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ కోర్సు కోసం ఉక్రెయిన్ వెళ్లి చదువు తర్వాత అక్కడే డాక్టర్ గా స్థిరపడ్డారు. పలు తెలుగు సినిమాల్లో నటించినా అవి విడుదల కాలేదు. తెలుగు, తమిళ, మలయాళ సీరియల్స్ లో అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. పలు ఉక్రెయిన్ సినిమాల్లో కూడా ఆయన నటించారు. 

Andhra Pradesh
doctor
Ukraine
taniku
kumar bandi
panthers

More Telugu News