Russia: మమ్మల్ని ఫిరంగి గుండ్లకు బలి చేసేందుకే పంపించారు: కంటతడి పెడుతున్న రష్యన్ సైనికులు

Russian soldiers caught by Ukraine are shedding tears
  • తీవ్ర స్థాయికి చేరుకున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం
  • ఉక్రెయిన్ కు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్న రష్యా సైనికులు
  • శిక్షణలో ఉన్న సైనికులను యుద్ధభూమికి పంపిన రష్యా
ఉక్రెయిన్ పై రష్యా దాడి తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఆ దేశంలోని నగరాలు శ్మశానాలుగా మారుతున్నాయి. ఇదే సమయంలో రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోతోంది. ఎంతో మంది రష్యాన్ సైనికులు ఉక్రెయిన్ బలగాలకు బందీలుగా దొరికిపోయారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బందీలుగా పట్టుబడ్డ రష్యన్ బలగాలను ఉక్రెయిన్ బలగాలు కెమెరాలు ఎదురుగా ఇంటర్వ్యూ చేశాయి. ఈ ఇంటర్వ్యూలో హృదయ విదారకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

తమను ఫిరంగి గుండ్లకు బలి ఇచ్చేందుకే ఇక్కడకు పంపారంటూ బందీలుగా చిక్కిన రష్యా సైనికులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఓ యువ సైనికుడు మాట్లాడుతూ, 'నేను చావడానికే ఇక్కడకు పంపారు. ఐ లవ్యూ అమ్మా' అంటూ కన్నీరు కార్చాడు. సైనిక శిక్షణలో ఉన్న తమకు అబద్ధాలు చెప్పి ఇక్కడకు తీసుకొచ్చారని తెలిపాడు. యుద్ధంలో తమను ముందు వరుసలో నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

తామెవరమూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, తమ యూనిట్ లో ఉన్న అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లాలనుకుంటున్నామని, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ వీడియోలను ఉక్రెయిన్ సోషల్ మీడియాలో పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Russia
Ukraine
War

More Telugu News