Ukraine: భారత విద్యార్థులను ఉక్రెయిన్ సైన్యం బంధించిందా? లేదా?.. క్లారిటీ ఇచ్చిన ఇండియా!

India says have not received any reports of any hostage situation regarding any student in Ukraine
  • ఖార్ఖివ్ లో భారత విద్యార్థులను ఉక్రెయిన్ సైన్యం బంధించిందన్న రష్యా
  • తమకు ఎలాంటి సమాచారం లేదన్న భారత్
  • విద్యార్థులతో అక్కడున్న ఇండియన్ ఎంబసీ నిరంతరం టచ్ లో ఉందని వివరణ
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు అక్కడి నుంచి తిరిగి రావడానికి రష్యా సహకారం అందిస్తోంది. భారతీయ విద్యార్థులు వారు ఉన్న ప్రాంతాల నుంచి కదలడానికి రష్యా సైనికులు సాయం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే మరోవైపు రష్యా రక్షణశాఖ సంచలన ప్రకటన చేసింది. 

ఖార్ఖివ్ లో ఇండియన్ స్టూడెంట్స్ ను ఉక్రెయిన్ బలగాలు బందీలుగా చేసుకున్నాయని తెలిపింది. తమకున్న సమాచారం ప్రకారం భారతీయ విద్యార్థులను పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ బలగాలు బలవంతంగా తమ అధీనంలో ఉంచుకున్నాయని రష్యా మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం భారత విద్యార్థులను బంధించినప్పటికీ... వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించేందుకు రష్యా సైన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. వారిని రష్యా భూభాగానికి తరలించి... తమ మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ విమానాల ద్వారా కానీ, ఇండియా విమానాల ద్వారా కాని భారత్ కు పంపిస్తామని తెలిపారు. 

ఖార్ఖివ్ ప్రస్తుతం రష్యా బలగాల అధీనంలోనే ఉంది. అక్కడ చిక్కుకుపోయిన భారత మహిళా విద్యార్థులను రష్యన్ బలగాలు రైలు మార్గం ద్వారా ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దులోకి పంపించాయి. మరోవైపు భారత విద్యార్థులను ఉక్రెయిన్ బలగాలు బంధించాయనే రష్యా వ్యాఖ్యలు కలకలం రేపాయి. 

దీనిపై భారత్ స్పందించింది. తమ విద్యార్ధులను బంధించారనే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి రిపోర్టులు రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి స్పష్టం చేశారు. ఖార్ఖివ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారత విద్యార్థులు ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దులకు చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఆ దేశ అధికారులను కోరామని చెప్పారు. 

ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులతో అక్కడున్న ఇండియన్ ఎంబసీ నిరంతరం టచ్ లో ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ అధికారుల సాయంతో ఖార్ఖివ్ నుంచి నిన్న చాలా మంది విద్యార్థులు వెళ్లిపోయారని చెప్పింది. ఉక్రెయిన్ బలగాల చేతిలో ఏ ఒక్క విద్యార్థి కూడా బందీగా ఉన్నట్టు తమకు సమాచారం లేదని తెలిపింది. మన జాతీయులను అక్కడి నుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు రష్యాతో పాటు రొమేనియా, పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్డోవా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పింది. 

మన వాళ్లను అక్కడి నుంచి తరలించేందుకు సహకరిస్తున్న ఉక్రెయన్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. మన విమానాలు అక్కడకు చేరుకుని మన వాళ్లను తీసుకొచ్చేంత వరకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దుల్లోని దేశాలకు థ్యాంక్స్ చెపుతున్నామని వ్యాఖ్యానించింది. భారత్ ఇచ్చిన వివరణతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మన విద్యార్థులు క్షేమంగా ఉన్నారనే సమాచారంతో వారి తల్లిదండ్రులు కుదుటపడుతున్నారు.
Ukraine
Russia
India
Indian Students
Hostage

More Telugu News