ధరణి వల్లే రియల్టర్ల హత్య.. రేవంత్ రెడ్డి ఆరోపణ
- ధరణి పోర్టల్ మొత్తం తప్పుల మయమే
- 20 ఏళ్ల క్రితం భూములు అమ్ముకున్న వారి పేరిటే ఇప్పటికీ భూములు
- సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్‌లే బాధ్యులు
- పోర్టల్‌లోని తప్పుల కారణంగానే గొడవలన్న రేవంత్
ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ కలిసే ధరణి పోర్టల్ తెచ్చారని గుర్తుచేసిన ఆయన.. ఆ పోర్టల్‌లో మొత్తం తప్పులే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టల్‌లోని తప్పుల కారణంగా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇబ్రహీంపట్నంలో ఇద్దరు రియల్టర్లు హత్యకు గురయ్యారని.. ఈ హత్యలకు ప్రధాన కారణం ధరణి పోర్టల్‌లో లోపాలేనని ఆయన విమర్శించారు. 20 ఏళ్ల క్రితం భూములు అమ్ముకున్న వారి పేర్లపైనే ఇంకా ఆ భూములు ఉన్నట్లుగా ధరణి పోర్టల్ చూపిస్తోందని.. దీంతో భూమి కొన్నవారు ఆగమై హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.