KTR: రోడ్లపై చెత్త పడకుండా సరికొత్త టెక్నాలజీతో ఉన్న వాహనాలను తీసుకున్నాం: కేటీఆర్

Our aim is Swach Hyderabad says KTR
  • హైదరాబాదును స్వచ్ఛంగా ఉంచేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాం
  • చెత్త సేకరణ కోసం 4,500 స్వచ్ఛ ఆటోలను వాడుతున్నాం
  • చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును ప్రారంభించబోతున్నాం
హైదరాబాదును స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కింద 2,500 నుంచి 6,500 మెట్రిక్ టన్నుల వరకు వ్యర్థాలను సేకరిస్తున్నారని తెలిపారు. చెత్తను సేకరించడం కోసం నగరంలో 4,500 స్వచ్ఛ ఆటోలను వాడుతున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరో 500 ఆటోలు రానున్నాయని తెలిపారు. దీంతో మొత్తం స్వచ్ఛ ఆటోల సంఖ్య 5 వేలకు చేరుతుందని చెప్పారు. 

వాహనాల నుంచి చెత్త రోడ్లపైకి పడకుండా సరికొత్త టెక్నాలజీతో రూపొందిన వాహనాలను ఈ కార్యక్రమం కోసం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్ కూడా ప్రారంభించబోతున్నామని చెప్పారు. చెరువుల్లో పెరుగుతున్న గుర్రపు డెక్కను తొలగించడానికి 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ లను ప్రారంభించామని తెలిపారు. పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ ఎస్సీటీపీ వాహనాలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
KTR
TRS
Swacha Hyderabad
KCR

More Telugu News