JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ఉక్రెయిన్ అనుకూల ట్వీట్లు

BJP national president JP Nadda Twitter account hacked
  • ఉక్రెయిన్ కోసం క్రిప్టో విరాళాలకు పిలుపు
  • రష్యాకు మద్దతుగా విరాళాలు కోరుతూ మరో ట్వీట్
  • ఖాతా పూర్తి పునరుద్ధరణ
  • కారణం గుర్తించేందుకు ట్విట్టర్ తో సంప్రదింపులు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాకర్ల చేతికి కొద్ది సేపు వెళ్లింది. నడ్డా ట్విట్టర్ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఉక్రెయిన్ కు అనుకూలంగా కొన్ని ట్వీట్లు పెట్టారు. 

‘‘ఉక్రెయిన్ ప్రజలకు బాసటగా నిలవాలి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ విరాళాలను బిట్ కాయిన్, ఎథీరియం రూపంలో తీసుకుంటున్నాం’’అంటూ నడ్డా ఖాతాలో హ్యాకర్లు ట్వీట్ పెట్టారు. రష్యాకు మద్దతుగా విరాళాలు కోరుతూ మరో ట్వీట్ కూడా పోస్ట్ చేయడం గమనార్హం. ‘‘మన్నించండి. నా అకౌంట్ హ్యాక్ అయింది. రష్యాకు ఇప్పుడు సాయం అవసరం. వారికి మద్దతుగా విరాళం ఇస్తున్నాను’’ అంటూ మరో ట్వీట్ వదిలారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని నిపుణుల దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి నడ్డా ఖాతాను హ్యాకర్ల బారి నుంచి రీస్టోర్ చేశారు. ‘‘ఇప్పుడు పూర్తి నియంత్రణలోనే ఉంది. అసలు కారణాన్ని తెలుసుకునేందుకు ట్విట్టర్ తో సంప్రదింపులు చేస్తున్నాం’’అని బీజేపీ నేత ఒకరు తెలిపారు. మొత్తం మీద నడ్డా ఖాతా కొంత సమయం పాటు హ్యాకర్ల చేతికి వెళ్లింది.
JP Nadda
BJP President
twitter
hacked

More Telugu News