Wonder Of The Seas: అలలపై కదిలే నగరం... ప్రపంచంలోనే అతి పెద్ద క్రూయిజ్ షిప్ ఇదిగో!

Wonder Of The Seas set to first sail
  • తొలి ప్రయాణం చేయనున్న వండర్ ఆఫ్ ద సీస్
  • ఫోర్ట్ లాడర్ డేల్ నుంచి కరీబియన్ దీవులకు పయనం
  • 18 అంతస్తుల ఓడ.. పొడవు 1,188 అడుగులు
  • ఫ్రాన్స్ లోని సెయింట్ నజైర్ లో నిర్మితమైన షిప్
టైటానిక్ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో విషాదాంతం అయినప్పటికీ, అతి పెద్ద ఓడగా పేరుగాంచింది. ఆ తర్వాత దాన్ని తలదన్నేలా అనేక భారీ క్రూయిజ్ నౌకలు తయారయ్యాయి. ఇప్పుడు వాటన్నింటిని మించిపోయేలా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ రంగప్రవేశం చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైనర్ సంస్థ కొత్తగా వండర్ ఆఫ్ ద సీస్ పేరిట భారీ క్రూయిజ్ షిప్ ను తీసుకువస్తోంది.

గత మూడేళ్లుగా ఈ అద్భుత నౌకను నిర్మిస్తున్నారు. దీని పొడవు 1,188 అడుగులు, వెడల్పు 210 అడుగులు. మార్చి 4న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ నుంచి కరీబియన్ దీవులకు తొలి పయనం ప్రారంభించనుంది. ఆ తర్వాత మే నెలలో బార్సిలోనా నుంచి రోమ్ వెళ్లనుంది. ఇది 18 అంతస్తుల క్రూయిజ్ నౌక. దీన్ని ఫ్రాన్స్ లోని సెయింట్ నజైర్ లో రూపొందించారు. ఈ వండర్ ఆఫ్ ద సీస్ క్రూయిజ్ నౌకలో మొత్తం 6,988 అతిథులు, 2,300 సిబ్బంది ప్రయాణించవచ్చు.

వాస్తవానికి ఈ భారీ ఓడ నిర్మాణం 2021లోనే పూర్తి కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి సంక్షోభ ప్రభావం దీనిపైనా పడింది. వండర్ ఆఫ్ ద సీస్ నౌక గురించి చెప్పాలంటే, ఇది అలలపై కదిలే విలాసవంతమైన నగరం అని చెప్పవచ్చు. ఓ నగరంలో ఉండే సౌకర్యాలన్నీ దీంట్లో ఉంటాయి.

భారీ తెరతో కూడిన సినిమా థియేటర్, అత్యాధునిక ప్లంజ్ పూల్ బార్, వండర్ ప్లే స్కేప్, ఓపెన్ ఎయిర్ కిడ్స్ ప్లే జోన్, క్లైంబింగ్ వాల్స్, గేమ్స్, అల్టిమేట్ ఫ్యామిలీ సూట్, భారీ హంగులతో మెయిన్ డైనింగ్ రూమ్, పార్కు, స్పోర్ట్స్ బార్, వండర్ లాండ్, లైవ్ మ్యూజిక్ థియేటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో 2,867 రూములు ఉంటాయి. 24 గెస్ట్ ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. దీని వేగం 22 నాట్లు.


Wonder Of The Seas
Cruise Ship
Royal Caribbean
Florida

More Telugu News