Imran Khan: రష్యా పర్యటనలో వున్న పాక్ ప్రధాని.... పుతిన్ తీరును పాక్ ఖండించాలన్న అమెరికా!

US wants Pakistan PM Imran Khan to condemn Russia decision on Ukraine
  • నిన్న రష్యా వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్
  • ఇవాళ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
  • పుతిన్ తో ఇమ్రాన్ ఖాన్ భేటీ
  • బాధ్యతగా వ్యవహరించాలన్న అమెరికా
రష్యాలో పర్యటిస్తున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇరకాటంలో పడ్డారు. మాస్కోలో ఇమ్రాన్ ఖాన్ పర్యటన కొనసాగుతున్న తరుణంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై దండయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇమ్రాన్ రష్యా పర్యటన నేపథ్యంలో, అమెరికా స్పందించింది. ఉక్రెయిన్ పై రష్యా చర్యలను ఖండించడం ప్రతి బాధ్యతాయుతమైన దేశం యుక్క తక్షణ బాధ్యత అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు.

"ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ పట్ల మా వైఖరిని పాకిస్థాన్ కు తెలియజేశాం. యుద్ధంపై మా దౌత్య విధానాలు, తీసుకుంటున్న చర్యల పట్ల పాకిస్థాన్ అధినాయకత్వానికి వివరించాం" అని ప్రైస్ తెలిపారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సహకారం, ఆఫ్ఘనిస్థాన్, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై చర్చల కోసం బుధవారం రష్యా తరలి వెళ్లారు. ఓవైపు అంతర్జాతీయ సమాజం రష్యాపై ఆంక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇమ్రాన్ ఖాన్ మాస్కో వెళ్లడం సాహసోపేతమైన నిర్ణయంగానే భావించాలి.

రష్యన్ సేనలు ఉక్రెయిన్ లో చొచ్చుకెళ్లిన తర్వాత పుతిన్ తో సమావేశమైన తొలి దేశాధినేత ఇమ్రాన్ ఖానే. గత 23 ఏళ్లలో ఓ పాకిస్థానీ ప్రధాని రష్యా వెళ్లడం కూడా ఇదే ప్రథమం. షెడ్యూల్ ప్రకారం ఈ భేటీ ముందే నిర్ణయం అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలకు దారితీస్తోంది.
Imran Khan
Pakistan
Russia
Vladimir Putin
Ukraine
USA
War

More Telugu News